గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 01:53:52

ప్రేమను చంపేశారు!

ప్రేమను చంపేశారు!

  • పరువు కోసం యువకుడి దారుణహత్య  
  • కూతుర్ని ప్రేమ పెండ్లి చేసుకున్నందుకే..యువతి తల్లిదండ్రులే సూత్రధారులు  
  • మేనమామ, స్నేహితులు పాత్రధారులు రూ.10లక్షల సుపారీ.. పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌  
  • కారులో కాళ్లు చేతులు కట్టేసి ఉరి బిగించి హత్య

పక్క పక్క ఇండ్లలో ఉండే వారిద్దరి మనసులు కలిశాయి.. ఏండ్లుగా ప్రేమించుకున్న వాళ్లు పెండ్లి చేసుకొని హాయిగా జీవించాలని కలలు కన్నారు.. పెద్దలను ఒప్పించాలని ప్రయత్నించినా, ఫలితం లేకపోవటంతో వారిని ఎదిరించి ఒక్కటయ్యారు.. కుటుంబసభ్యులకు దూరంగా వేరుకాపురం పెట్టారు.. కానీ, ‘పరువు’ వారి జీవితాలను ఛిద్రం చేసింది. వారి బంగారు భవిష్యత్తును బుగ్గి చేసింది. కులం కానివాడని, ఆస్తిలేనోడని అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు కక్ష కట్టారు. ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి యువకుడిని సుతిల్‌ తాడుతో గొంతు నులిమి ప్రాణం తీశారు. ప్రణయ్‌ హత్యను గుర్తు చేసే ఈ ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకున్నది.

శేరిలింగంపల్లి, కొండాపూర్‌: ఇది మరో ప్రణయ్‌ హత్య.. హేమంత్‌ అనే యువకుడి ఖూనీ. అదీ ప్రేమ వల్లే.. ఇదీ ప్రేమ వల్లే. అదీ పరువు కోసమే.. ఇదీ పరువు కోసమే. అక్కడ కులం, ఆస్తి దోషులు.. ఇక్కడా అంతే. ఈ రెండు హత్యలు కూడా సుపారీ ఇచ్చి చేయించినవే. హత్య చేయించింది కూతుళ్ల కుటుంబసభ్యులు కాగా, హత్యకుగురైంది.. అల్లుళ్లే. అక్కడ నరికి చంపారు.. ఇక్కడ ఉరి బిగించారు. అంతేతేడా. మిర్యాలగూడ ప్రణయ్‌ హత్యను గుర్తుచేసే ఘటన.. గురువారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్నది. పరువు కోసం హేమంత్‌ అనే యువకుడిని దారుణ హత్య చేశారు. గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చింతయోగ మురళీకృష్ణ, లక్ష్మీరాణి దంపతులు కొన్నేండ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు హేమంత్‌ కుమార్‌ (26) బీఎస్సీ పూర్తిచేసి ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. వీరిఇంటి పక్కనే దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు నివసిస్తుండేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె అవంతి(23) ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం చందానగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నది. గతంలో ఒకే కాలనీలో ఉన్నసమయంలో నాలుగేండ్లక్రితం హేమం త్‌, అవంతి ప్రేమలో పడ్డారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. కులాలు వేరు కావటం, ఆస్తుల మధ్య తేడా ఉండటంతో అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో.. జూన్‌ 9న ఇండ్లలోంచి వెళ్లిపోయి.. అదే నెల 11న కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. తమకు భద్రత కల్పించాలని చందానగర్‌ పోలీసులతోపాటు సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను ఆశ్రయించారు. తన భర్తతోనే ఉంటానని అవంతి చెప్పటంతో.. పోలీసులు రెండు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొత్త దంపతులు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టారు.

కూతుర్ని ఇంటికి రప్పించుకోవాలని..

హేమంత్‌తో పెండ్లిని అంగీకరించని అవంతి కుటుంబసభ్యులు ఆమెను ఎలాగైనాఇంటికి తెచ్చుకోవాలని ప్రయత్నించారు. తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన, మేనమామ యుగేందర్‌రెడ్డి కలిసి హేమంత్‌ హత్యకు పథకం రచించారు. యుగేందర్‌రెడ్డి స్నేహితులు బిచ్చుయాదవ్‌, ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషా అలియాస్‌ లడ్డూతో హత్య చేయించాలని, రూ. 10 లక్షలకు సుపారి కుదుర్చుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ముం దుగా తియ్యని మాటలతో కూతురు, అల్లుడితో తాము మారినట్టు నమ్మించాలని కుట్ర చేశారు. వాళ్లు ఇంట్లోనే ఉన్నారా? లేదా? అని రెక్కీ కూడా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బంధువులందరితో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లి.. చందానగర్‌లోని ఇంటికి వెళ్దామని అడగటంతో హేమంత్‌, అవంతిరెడ్డి సరేనన్నారు.  అవంతి తల్లిదండ్రులు, మేనమామలు విజేందర్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి మేనల్లుళ్లు రంజిత్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, మేనకోడలు రజిత, సందీప్‌రెడ్డి భార్య స్వప్న, రంజిత్‌రెడ్డి భార్య స్పందన, డ్రైవర్‌ షేక్‌ సాహెబ్‌ కలిసి 3 కార్ల లో చందానగర్‌కు పయనమయ్యారు. అవంతి, హేమంత్‌, యుగేందర్‌రెడ్డి, అతడి స్నేహితులు ఒక కారులో, మిగతా వాళ్లు వేరే కార్లలో బయల్దేరారు. మార్గమధ్యలో గోపన్‌పల్లి తండా జంక్షన్‌ వరకు వచ్చిన కార్లు వట్టినాగులపల్లి ఓఆర్‌ఆర్‌ వద్ద ఎడమ వైపు మళ్లించారు. చందానగర్‌లోని ఇంటికి వెళ్లాలంటే గోపన్‌పల్లి తండా జంక్షన్‌ నుంచి కుడివైపుకు వెళ్లాలి, కానీ.. ఎడమవైపునకు కార్లను తిప్పటంతో అవంతి, హేమంత్‌కు అనుమానం వచ్చింది. వెంటనే వాళ్లు కార్లలో నుంచి బయటకు దూకి రోడ్డుపై పరుగులు తీశారు. యుగేందర్‌రెడ్డి హేమంత్‌ను పట్టుకొని తన కారులో ఎక్కించుకుని వట్టినాగులపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు వైపు వెళ్లిపోయాడు. అవంతి వెంటనే ఈ విషయాన్ని అత్తమామలకు ఫోన్‌చేసి చెప్పింది. వాళ్లు డయల్‌ 100 ద్వారా సైబరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అవంతితోపాటు తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


మారుతీరావు ఘటనతో ..ఇంట్లో ఒప్పించాలన్నాం

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య ఉదంతంతో మేము కూడా భయపడ్డాం. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకోవాలని మా కోడలికి చెప్పా. దీంతో ఆమె ఇంట్లో ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయితే, ఏడు నెలల పాటు ఆమెను గృహ నిర్బంధంలో పెట్టారు. ఓ రోజు ఆ చెర నుంచి బయటికి వచ్చి నా కొడుక్కి ఫోన్‌ చేసింది. ఆమె వద్ద ఫోన్‌ లేకపోవటంతో రోడ్డున పోయే వాళ్ల ఫోన్‌తో ఫోన్‌ చేసి కలుసుకుంది. అరగంటలోనే వారిద్దరు పెండ్లి చీర, పంచె కొనుక్కొని వెళ్లి రిజిస్ట్రార్‌ వద్ద పెళ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడాం. నిన్న నా కొడుకు, కోడలిని కారులో ఎత్తుకెళ్లారు. మా కోడలు బావలు వాళ్లిద్దరిని కొడుతూ తీసుకెళ్లారు. రోడ్డుపై ఆ కొట్లాటను ఎవరైనా ఆపిఉంటే నా కొడుకు బతికేవాడు

- రాణి, హేమంత్‌ తల్లి

నమ్మించి మోసం చేశారు

నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్నీ బలవంతంగా కార్లోకి ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక ఇద్దరం కారులోంచి దూకేశాం. అయితే హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకొని వెళ్లిపోయారు. హేమంత్‌ చనిపోయినట్టు శుక్రవారం ఉదయం పోలీసులు చెప్పారు. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి. మమ్మల్ని నమ్మించి తీసుకెళ్లి హేమంత్‌ను చంపేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్‌ ఈరోజు బతికి ఉండేవాడు

- అవంతిరెడ్డి

సుతిల్‌తాడు గొంతుకు బిగించి..

యుగేందర్‌రెడ్డి వాహనం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యుగేందర్‌రెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడం, హేమంత్‌ తన వెంట ఫోన్‌ తీసుకెళ్లకపోవటంతో వాళ్ల లొకేషన్‌ కనుక్కోవడం కష్టంగా మారింది. యుగేందర్‌రెడ్డి తన కారును కొల్లూరు ఔటర్‌ రింగురోడ్డు మీదుగా పటాన్‌చెరు, అక్కడి నుంచి జహీరాబాద్‌ వరకు వెళ్లారు. జహీరాబాద్‌లో ఓ దాబా వద్ద మద్యం తీసుకుని, సుతిల్‌దారం ఉండను కొన్నారు. మద్యం సేవించి హేమంత్‌ చేతులు, కాళ్లు సుతిల్‌తో కట్టేసి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. యుగేందర్‌, మరో ఇద్దరు స్నేహితులు కలిసి కారులో హేమంత్‌ గొంతును సుతిల్‌ తాడుతో బిగించి, కారు తుడిచే గుడ్డతో నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. సంగారెడ్డి సమీపంలో ఎంజీ ఎలైట్‌ స్కేర్‌ వెంచర్‌లోకి కారు తిప్పి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని నిర్మానుష్య పొదల్లో పడేసి వెళ్లిపోయారు. శామీర్‌పేటలోని ఓ స్నేహితుడి ఇంటికి చేరుకొన్న యుగేందర్‌రెడ్డిని, అతడి స్నేహితులను సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా గుర్తించిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొన్నారు. మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 592, 120(బీ), 302, 365, 452, 509, 323, 506, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. హేమంత్‌ మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. హేమంత్‌ తమ్ముడు విదేశాల నుంచి శనివారం రానున్నాడని, అతనికి మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొన్నారు.


logo