మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 02:20:28

రాములోరి కల్యాణానికి రావద్దు!

రాములోరి కల్యాణానికి రావద్దు!

  • కరోనా కారణంతో ఆలయంలోనే నిరాడంబరంగా నవమి వేడుకలు
  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం/భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలంలో ప్రతిఏడాది వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం కరోనా వైరస్‌ కారణంగా ఈసారి నిరాడంబరంగా జరుగనున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా శ్రీరామనవమి వేడుకను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ రెండున సీతారాముల కల్యాణం భక్తులు లేకుండానే జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని వీడీవోస్‌కాలనీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో మిథిలా ప్రాంగణంలో తలపెట్టిన సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రామాలయాన్ని కట్టించిన భక్తరామదాసు కాలంలో నవమి వేడుకలు ఇక్కడే జరిగేవని గుర్తుచేశారు.

ఆన్‌లైన్‌లో విక్రయించిన కల్యాణ టిక్కెట్ల సొమ్ము భక్తులకు వాపసు

ఆన్‌లైన్‌లో విక్రయించిన రాములోరి కల్యాణ టికెట్ల సొమ్మును భక్తులకు వాపస్‌ ఇవ్వనున్నట్టు దేవస్థానం ఈవో జీ నరసింహులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 1003 టిక్కెట్లు విక్రయించామని, తద్వారా సుమారు రూ.13.80 లక్షల ఆదాయం వచ్చిందని, మిథిలా ప్రాంగణం వేదిక మారిన నేపథ్యంలో టిక్కెట్ల సొమ్ములను తిరిగి భక్తులకు ఇస్తామని తెలిపారు. త్వరలోనే వైదిక కమిటీతో సమావేశమై ఆలయ ప్రాంగణంలో నిర్వహించే నవమి వేడుకలపై సమాలోచనలు జరుపుతామని పేర్కొన్నారు.logo
>>>>>>