e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home Top Slides నమ్మితే నైజీరియన్లు ముంచేస్తారు!

నమ్మితే నైజీరియన్లు ముంచేస్తారు!

నమ్మితే నైజీరియన్లు ముంచేస్తారు!
  • ఐటీ రిటర్న్స్‌ ముసుగులో సమాచార సేకరణ
  • సిమ్‌స్వాప్‌ చేస్తూ కోట్ల రూపాయల లూటీ
  • తెలియని లింక్‌లను తెరువొద్దంటున్న పోలీసులు

కంటికి కనిపించరు. కానీ, ఖాతా ఖాళీ చేసేస్తారు. ఆదాయం పన్ను రిటర్నులంటూ ఈమెయిళ్లు, ఫోన్‌లకు బల్క్‌ మెసేజ్‌లు పంపుతారు. ఫిషింగ్‌ మెయిల్‌లింక్‌లను పంపి సమాచారం కొట్టేస్తారు. సిమ్‌లను స్వాప్‌ చేస్తారు. కొత్త అప్లికేషన్‌లతో మన ఫోన్లలోకి చొరబడతారు. పక్కాస్కెచ్‌తో పని పూర్తిచేస్తారు. కొట్టేసిన డబ్బును వ్యాపారం పేరుతో దేశాలు దాటిస్తారు నైజీరియన్‌ సైబర్‌ మోసగాళ్లు.
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (నమస్తే తెలంగాణ): నైజీరియన్‌ సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి పక్కాగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. నైజీరియన్‌ సైబర్‌క్రైం డాన్‌ ఎగిబ్గో ఇన్నోసెంట్‌ అలియాస్‌ జేమ్స్‌.. సిమ్‌స్వాప్‌తో మోసాలు చేస్తున్నట్టు రాష్ట్ర పోలీసుల గుర్తించారు. నైజీరియాలోనే ఉంటూ భారత్‌లో కొందరు నైజీరియన్లు, మరికొందరితో కోల్‌కతా, ముంబైలోని ముఠాలు ఏర్పాటుచేసి ఈ దందాకు తెరలేపారు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలంటూ బల్క్‌గా ఈమెయిల్స్‌ పంపి వల వేస్తారు.

అందులో ఫిషింగ్‌ మెయిల్‌లింక్‌లు ఉంటాయి. అది నిజమేనని నమ్మి ఎవరైనా లింక్‌ తెరిచి పేరు, బ్యాంకు ఖాతానంబర్‌ ఇలా ప్రాథమిక వివరాలు నమోదుచేయగానే.. బ్యాంక్‌ హోం పేజీ తెరుచుకునేలా ఓ ఫిషింగ్‌ పేజీ వస్తుంది. అందులో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ నమోదుచేయగానే వివరాలు వారికి వెళ్లిపోతాయి. ఫలానాఖాతాలో ఎక్కువ డబ్బు ఉన్నదని నిర్ధారించుకున్నాక ఖాతాదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌నంబర్‌ను ఈ మెయిల్‌ ఐడీ ద్వారా తెలుసుకుంటారు. ఆ మొబైల్‌ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డుకు రీప్లేస్‌ సిమ్‌కార్డు కావాలని, భారత్‌లో ఉండే కొందరు నైజీరియన్ల ద్వారా కోల్‌కతా నార్త్‌ 24 పరగణాలోని బీహారీ ముఠాలు, ముంబై మీరా రోడ్డు ప్రాంతంలోని ముఠాలను సంప్రదిస్తారు.

డబ్బు కొట్టేయాలనుకుంటున్న వాళ్ల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌, మెయిల్‌లో ఉండే ఆధార్‌, ఓటర్‌ఐడీ, లేదా కంపెనీ ఐడీ ఇలా ఏది ఉంటే దాన్ని స్కాన్‌చేస్తారు. అందులో ఫొటో మార్చి కాపీని ఇక్కడి ముఠాలకు పంపుతారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆ నెట్‌వర్కింగ్‌ కంపెనీ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ‘నా ఫోన్‌ పోయింది. సిమ్‌కార్డ్‌ బ్లాక్‌ చేయండి’ అని చెప్పిస్తారు. వెంటనే దగ్గర్లో ఉన్న స్టోర్‌కు వెళ్లి అప్పటికే నైజీరియన్‌ నుంచి వచ్చిన జిరాక్స్‌కాపీ పెట్టి కొత్త సిమ్‌కార్డు తీసుకుంటారు. అసలు సిమ్‌కార్డు బ్లాక్‌ అవుతుంది.

అప్పటికే శనివారం సాయంత్రం కావడంతో ఎవరైనా సిమ్‌కార్డు గురించి ఫిర్యాదు చేయాలనుకున్నా అవకాశం ఉండదనేది నైజీరియన్‌ ప్లాన్‌. ఆదివారం రాత్రి 10 గంటల వరకు కొత్త సిమ్‌కార్డుకు ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ యాక్టివేట్‌ అవుతుంది. అప్పటికే నైజీరియన్‌ దగ్గర ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఉండగా.. ఇక ఓటీపీ కూడా తన చేతుల్లోకి వచ్చేయడంతో ఖాతాలోని డబ్బు ముఠాసభ్యుల ఖాతాల్లోకి పంపిస్తాడు. కొన్నిసార్లు నేరుగా బిట్‌కాయిన్‌ కంపెనీల ఖాతాలనే బెనిఫిషరీ అకౌంట్‌గా యాడ్‌ చేసి.. డబ్బుపంపి బిట్‌కాయిన్ల రూపంలో కొల్లగొడుతున్నారు. సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఇలాంటి కేసుల్లో పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన ఏడు కేసులను ఛేదించారు. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారు.
వస్త్ర వ్యాపారం పేరిట దేశాలు దాటుతున్న డబ్బు
కొట్టేసిన డబ్బును ముంబై, కోల్‌కతా ముఠాల సభ్యులు ఏటీఎంల నుంచి డ్రాచేసి ఇక్కడి నైజీరియన్లకు ఇస్తారు. వారు ఆ డబ్బు నైజీరియా నుంచి తమిళనాడులోని తిరుపూర్‌కు వచ్చిన మరికొందరికి అప్పగిస్తారు. వీరు ఇక్కడ వస్ర్తాలు కొని నైజీరియా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడికి వెళ్లాక వ్యాపారుల నుంచి డబ్బుగా మార్చుకుంటారు.

లింక్‌లను నమ్మి మోసపోవద్దు

  • ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్స్‌ పేరిట వచ్చే ఈ మెయిళ్లను నమ్మవద్దు. రిటర్న్స్‌ ఫైల్‌ చేసేటప్పుడే ఖాతా వివరాలు ఇస్తాం. మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌లో పంపే లింక్‌లు తెరువొద్దు.
  • శనివారం సాయంత్రం అకస్మాత్తుగా సిమ్‌కార్డు డియాక్టివేట్‌ అయితే వెంటనే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలి.
  • బ్యాంకు, ఫేస్‌బుక్‌ తదితరాల పాస్‌వర్డ్‌లు తరచూ మార్చాలి.
  • సెకండ్‌ ఫ్యాక్టర్‌ వెరిఫికేషన్‌కు అవకాశం ఉన్న ప్రతిచోటా ఎనేబుల్‌ చేసుకోవడం మంచిది.
  • పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ లేదా ప్యాట్రన్‌లాక్‌లు ఒక అథెంటికేషన్‌. రెండోది ఓటీపీ ద్వారా చేసుకోవడం. ఇక మూడోదశ అథెంటికేషన్‌ ఐరిస్‌ లేదా బయోమెట్రిక్‌ పెట్టుకుంటే ఖాతాలు భద్రంగా ఉంటాయి.
Advertisement
నమ్మితే నైజీరియన్లు ముంచేస్తారు!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement