మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:17

ఇక పండుగే!

ఇక పండుగే!

 • రాష్ట్రంలో కొత్తగా వివిధ రకాల పండ్ల సాగు
 • 5.24 లక్షల ఎకరాల్లో కూరగాయలు
 • సుగంధ ద్రవ్యాల సాగు పెంచే చర్యలు
 • ప్రణాళికలు రూపొందించిన ఉద్యానశాఖ 

కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల కోసం ఇక పక్క రాష్ర్టాల వైపు చూడాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను పండించేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వినియోగదారులు ‘పండు’గ చేసుకునేలా రాష్ట్రంలోనే కొత్తగా పలు రకాల పండ్లను 65,866 ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగుచేయడం వల్ల 36 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సుగంధ ద్రవ్యాల సాగు కూడా పెంచేలా ప్రణాళికలు వేసింది. అవసరాలు తీర్చేలా కూరగాయల సాగురాష్ట్రంలో ప్రస్తుతం 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తుండగా, 30.71 లక్షల టన్నుల దిగుబడి వస్తున్నది. రాష్ట్రంలో 20 రకాలకుపైగా కూరగాయలను సాగుచేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతినెలా 3 లక్షల టన్నుల కూరగాయలను ఉపయోగిస్తున్నారు. ఏడాదికి 36 లక్షల టన్నులను వినియోగిస్తున్నారు. ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.2,782 విలువగల 90 కిలోల కూరగాయలు తింటున్నారు. 

రాష్ట్రంలోని 4 కోట్ల జనాభా సంవత్సరానికి కూరగాయల కొనుగోలు కోసం రూ.11,130 కోట్లు ఖర్చుచేస్తున్నది. మరోవైపు రాష్ట్రంనుంచి టమాట, వంకాయ, బెండ మొదలైన ఉత్పత్తులు 7.72 లక్షల టన్నులను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నాం. ఉల్లి, మిరప, బీర, సోర, కాకర, చిక్కుడు, దోసజాతి, ఆలుగడ్డ, క్యారెట్‌, ఆకుకూరలు ఇలా 17 రకాల కూరగాయలు.. 13 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతులను తగ్గించేలా ఈ ఏడాది ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14 రకాల పండ్లు వినియోగిస్తుండగా 12 రకాల పండ్లు రాష్ట్రంలోనే పండుతున్నాయి. 4.35 లక్షల ఎకరాల్లో సాగుతో 22.97 లక్షల టన్నుల దిగుబడి వస్తున్నది. సగటున ఒక మనిషి రోజుకు 99 గ్రాముల పండ్లు తింటున్నాడు. నెలకు 2.97 కిలోలు, సంవత్సరానికి 31.10 కిలోలు తింటున్నాడు. 

రాష్ట్రంలోని మొత్తం జనాభా సంవత్సరానికి 12.44 లక్షల టన్నుల పండ్లను వినియోగిస్తున్నది. ఒక వ్యక్తి పండ్ల కోసం సంవత్సరానికి రూ.1,986 ఖర్చు చేస్తున్నాడు. ఇలా రాష్ట్ర జనాభా రూ.7,942 కోట్లు వెచ్చిస్తున్నది. రాష్ట్ర ప్రజలు ఉపయోగించే 14 రకాల పండ్లలో మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పా యి, పుచ్చపండు మన అవసరాలకు మించి ఉత్పత్తిచేస్తూ.. 18.44 లక్షల టన్నులను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నాం. యాపిల్‌, పైనాపిల్‌ మన రాష్ట్రంలో పండవు. అందుకే అరటి, సపోట, నేరేడు, కర్బూజతో పాటు మరో మూడురకాల పండ్లు 7.91 లక్షల టన్నులను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ పండ్ల రకాలను ఈ ఏడాది కొత్తగా 65,866 ఎకరాల్లో సాగుకు ఉద్యానశాఖ నిర్ణయించింది.

సుగంధం వెదజల్లాలి

రాష్ట్రంలో ఏడాదికి 3.85 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలు సాగుచేస్తుండగా 7.85 లక్షల టన్నుల దిగుబడి వస్తున్నది. రాష్ట్రంలో 8 రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. పసుపు విస్తీర్ణం, దిగుబడి విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. పసుపు, మిర్చిని మన అవసరాలకు మించి సాగుచేస్తున్నాం. రాష్ట్ర జనాభా ఏటా 3.08 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాల ఉపయోగిస్తూ.. ఇందుకోసం రూ.5,286 కోట్లు ఖర్చుచేస్తున్నది. ఈ ఏడాది కొత్తగా ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, చింతపండు మొదలైన పంటలను 95,646 ఎకరాల్లో సాగుచేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇక 24 జిల్లాల్లో 7.64 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు నిర్ణయించింది.

రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు

 • సాగు విస్తీర్ణం  4.35 లక్షల ఎకరాలు
 • మొత్తం దిగుబడి 22.97 లక్షల టన్నులు
 • ఏడాదికి సగటు వినియోగం 12.44 లక్షల టన్నులు
 • ఒక వ్యక్తి సగటు వినియోగం ఏడాదికి 31.10 కిలోలు
 • ఒక వ్యక్తి ఏడాదికి పెట్టే ఖర్చు రూ.1,986
 • రాష్ట్రం నుంచి ఎగుమతులు 18.44 లక్షల టన్నులు
 • ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి 7.91 లక్షల టన్నులు

రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు

 • సాగు విస్తీర్ణం  3.52 లక్షల ఎకరాలు
 • మొత్తం దిగుబడి 30.71లక్షల టన్నులు
 • ఏడాదికి సగటు వినియోగం 36 లక్షల టన్నులు
 • ఒక వ్యక్తి సగటు వినియోగం ఏడాదికి 90 కిలోలు
 • ఒక వ్యక్తి ఏడాదికి పెట్టే ఖర్చు రూ.2,782
 • రాష్ట్రం నుంచి ఎగుమతులు 7.72 లక్షల టన్నులు
 • ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి 13 లక్షల టన్నులు


logo