సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 15:04:27

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి : మంత్రి ఈటల

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కరోనా విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నిన్న జరిగిన జన్‌ సంవాద్‌ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దేశానికి కంటైన్‌మెంట్‌ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే అప్రమత్తం చేసిందే తామన్నారు.

దేశమంతా కరోనాపై పోరాడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ బిజీగా ఉందని అన్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజల్ని సీఎం కేసీఆర్‌ నిరంతరం చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందాలు సైతం ప్రశంసించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకోవడంలో తమకున్న నిబద్దత మీకేదని ప్రశ్నించారు. రాష్ర్టాలను విమర్శించే ముందు కేంద్రం నిర్వహించిన బాధ్యత ఏందో చెప్పాలన్నారు. కేంద్ర సంస్థ ఐసీఎంఆర్‌ ఎన్నిసార్లు గైడ్‌లైన్స్‌ మార్చిందో, అయోమయానికి గురిచేసిందో బీజేపీ నేతలు ముందుగా తెలుసుకోవాలన్నారు. కేంద్రం రాష్ర్టానికి సహకరించకుండా తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్‌ మిషనరీని వేరే రాష్ర్టాలకు తరలించిందన్నారు. కరోనాపై కేంద్ర బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. జేపీ నడ్డా బాధ్యత లేకుండా మాట్లాడారన్నారు.

కరోనా కట్టడిలో బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ చాలా ముందుందన్నారు. బీజీపీ అధికారంలోకి వస్తే దేశమంతా గుజరాత్‌లా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. ఇది పరస్పర ఆరోపణలకు సంబంధించిన సమయం కాదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ అనుక్షణం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. కరోనా కట్టడిలో సఫలమైన రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి పేర్కొన్నారు.


logo