ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:16:01

ఇక డిజిటల్‌ పాఠాలు!

ఇక డిజిటల్‌ పాఠాలు!

 • ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ సిద్ధం
 • మార్గదర్శకాలు రూపొందించిన విద్యాశాఖ
 • ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన
 • సమయం వృథా కాకుండా చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు తెరిచేవరకు రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు సిద్ధమవుతున్నది. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరువాలన్న ఆలోచనతో ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను రూపొందించింది. పాఠశాలల్లో ఆన్‌లైన్‌/ దూర విద్యావిధానం కోసం దీన్ని తయారుచేసింది. విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) విడుదలచేసిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అనుసరిస్తూ రాష్ట్రంలో దీన్ని రూపొందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడప్పుడే స్కూళ్లను ప్రారంభించే, రెగ్యులర్‌ తరగతులు నిర్వహించే అవకాశం లేదు. అప్పటివరకు విద్యార్థుల సమయం వృథాకాకుండా ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను రూపొందించి ప్రభుత్వానికి పంపినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే అంశంపై కేంద్రం అనుమతి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

కమిటీ ప్రతిపాదించిన మార్గదర్శకాలు 

 • ప్రభుత్వ, ఎయిడెడ్‌తోపాటు ప్రైవేటు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అనుసరించాలి.
 • ప్రస్తుతానికి రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలన్న ఆలోచనలు చేస్తుండటం వల్ల ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు విద్యా ప్రణాళికలను రూపొందించారు.
 • ప్రతి టీచర్‌ తరగతి గదిలోని ఒక్కో విద్యార్థివారీగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. విద్యార్థులను మూడురకాలుగా విభజించుకోవాలి. 1. ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఉన్న విద్యార్థులు. 2. రేడియో లేదా దూరదర్శన్‌ అందుబాటులో ఉన్నవాళ్లు. 3. క్యంపూటర్‌, మొబైల్‌, రేడియో, దూరదర్శన్‌ అందుబాటులో లేని విద్యార్థులు. 
 • 1-5వ తగరతి వరకు కనీస సామర్థ్యాలు పెంచేలా 10నుంచి 12 వారాల, 6 నుంచి 8 తరగతులకు నాలుగు లేదా ఆరువారాల, 9, 10 తరగతులకు నాలుగునుంచి ఆరువారాల ప్రత్యా మ్నాయ క్యాలెండర్‌ను టీచర్లే రూపొందించాలి. 
 • రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు విధానం వద్దు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్లు వారానికోసారి స్కూల్‌కు హాజరుకావాలి. 
 • మొబైల్‌, టీవీ, యూట్యూబ్‌, రేడియో వంటివి అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం సంచార వాహనాలను ఏర్పాటుచేసి బోధన సాగించేలా చర్యలు తీసుకోవాలి. 

సగంమందికే క్లాస్‌రూమ్‌ బోధన!

 • మిగతావారికి ఆన్‌లైన్‌ క్లాసులు 
 • ప్రభుత్వానికి ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు 

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు పూర్తిస్థాయిలో తరగతి గది బోధన సాధ్యం కాదని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నది. సగం మంది విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ బోధన, మరో సగం మందికి ఆన్‌లైన్‌ బోధన అందించాలని యోచిస్తున్నది. ఈ విధంగా ప్రత్యామ్నాయ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించే ఆలోచనలో ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నట్టు తెలిసింది. సిలబస్‌ కూడా అందుకనుగుణంగానే రూపొందించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. విద్యాసంవత్సరాన్ని ఎప్పటినుంచి ప్రారంభించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టతలేకుండా పోయిందని బోర్డు అధికారులు తెలిపారు.

త్వరలో డిజిటల్‌ పాఠాలు

త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన వెల్లడించారు. ఇందుకోసం డీఈవోలు అన్ని ఏర్పాట్లుచేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం డీఈవోలతో జూమ్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


logo