శనివారం 11 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 10:00:50

మ‌ధ్యప్ర‌దేశ్‌వైపు ఆ మిడ‌త‌ల దండు

మ‌ధ్యప్ర‌దేశ్‌వైపు ఆ మిడ‌త‌ల దండు

హైదరాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని రాంటెక్‌కు వ‌చ్చిన మిడతల గుంపు నుంచి తెలంగాణ‌కు ముప్పుత‌ప్పింది. రాంటెక్ నుంచి ఆ మిడ‌త‌ల దండు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వైపు వెళ్లిందని, ఉత్త‌ర‌దిశ‌గా 60 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించి మెహాడీ అనే గ్రామంలో అవి ఆగాయ‌ని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. రాంటెక్ ప్రాంతానికి  వ‌చ్చిన మిడ‌త‌లు దక్షిణం వైపు ప్రయాణించి తెలంగాణలో ప్రవేశిస్తాయేమోన‌నే అంచ‌నాతో తెలంగాణ ప్ర‌భుత్వం సరిహద్దు జిల్లాల అధికార‌ యంత్రాంగాల‌ను అప్రమత్తం చేసింది. 

అయితే, అవి వ్యతిరేక దిశలో మధ్యప్రదేశ్‌ దిశగా సాగుతుండటంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలకు తాత్కాలికంగా ముప్పు తప్పింది. అయితే అవి ఏ సమయంలో ఎటువైపు తిరుగుతాయో తెలియద‌ని, అందుకే నిఘా కొన‌సాగిస్తున్నామ‌ని తెలంగాణ అధికారులు తెలిపారు. కాగా, గురువారం వాతావరణం అనుకూలించకపోవ‌డంతో అధికారులు హెలికాప్టర్‌లో రాష్ట్ర సరిహద్దులను పర్య‌వేక్షించ‌లేక‌పోయారు. ఈ నెల 20 తర్వాత మిడతలు మళ్లీ వచ్చే అవకాశముందన్న అంచ‌నాల మేర‌కు వాటిని నియంత్రించ‌డం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న‌ది. 


logo