శనివారం 04 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:12:02

ఛత్తీస్‌గఢ్‌ దిశగా మిడతల దండు

ఛత్తీస్‌గఢ్‌ దిశగా మిడతల దండు

  • తెలంగాణకు తాత్కాలికంగా తప్పిన ముప్పు! 
  • నైరుతి రుతుపవనాల రాకతో రాష్ర్టానికి మేలు 
  • సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిడతల దండు ప్రమాదం తెలంగాణకు తాత్కాలికంగా తప్పినట్టు కనిపిస్తున్నది. ఐదురోజుల క్రితం మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద తిష్టవేసిన మిడతల దండు అక్కడి నుంచి గోండియా జిల్లాకు వెళ్లినట్టు గుర్తించారు. శనివారం గోండియా జిల్లాలోని పూజరిటోల మండలం కాస గ్రామంలో ఇది కేంద్రీకృతమై ఉన్నది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ వైపు కదులుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తాత్కాలికంగా ముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా రాష్ర్టానికి మిడతల ముప్పు తప్పడంలో కొత్తవరకు మేలు చేసినట్టు తెలుస్తున్నది. గాలివాటంతో ప్రయాణించే మిడతల దండు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సరిహద్దు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగానే ఉన్నది. రైతులకు అపారనష్టం కలిగించే మిడతల దండును అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టిసారించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు తెలంగాణ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, అగ్నిమాపకశాఖల అధికారులను అప్రమత్తంచేశారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. 


logo