బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 02:33:26

విద్యుత్‌ కేంద్రాల లాకౌట్‌!

విద్యుత్‌ కేంద్రాల లాకౌట్‌!

  • ఎన్‌ఎల్డీసీకి అధికారాలతో థర్మల్‌ కేంద్రాలకు ముప్పు
  • ఉత్సవ విగ్రహాలుగా మారనున్న ఆర్‌ఎల్డీసీ, ఎస్‌ఎల్డీసీ
  • కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లు ప్రభావం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లులోని కొన్ని అంశాలు ఆయా రాష్ర్టాలలోని విద్యుదుత్పత్తి కేంద్రాల మూసివేతకు దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత బిల్లులో దేశవ్యాప్తంగా విద్యుత్‌ నిర్వహణ (ఆపరేషనల్‌) అధికారాలను ఎన్‌ఎల్డీసీ (నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌)కు అప్పగించారు. దీంతో విద్యుదుత్పత్తి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడం,  సబ్‌స్టేషన్ల నిర్వహణ ఎన్‌ఎల్డీసీ పరిధిలోకి వెళ్తాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌ నిర్వహణ ఎలాంటిదైనా ఎన్‌ఎల్డీసీ ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ప్రస్తుతం ప్రాంతీయ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి, సబ్‌స్టేషన్లు, పీపీఏలు తదితర అంశాలపై రీజనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఆర్‌ఎల్డీసీ), స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్డీసీ) నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్‌ఎల్డీసీ తెరపైకి రావడంతో ఆర్‌ఎల్డీసీ, ఎస్‌ఎల్డీసీల పాత్ర నామమాత్రం కానుంది. ఇవి ఉత్సవ విగ్రహాలుగా మారి ఎన్‌ఎల్డీసీ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలుచేసే సంస్థలుగా మిగిలిపోతాయి. దేశంలోని విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడెక్కడ ఎంత ఉత్పత్తి జరుగుతున్నది, డిమాండ్‌ ఏ మేరకు ఉంటుంది అన్న అంశాలను అంచనావేసి రాష్ర్టాల అవసరాలు, అత్యవసర సమయాల్లో సరఫరా తదితర అంశాలపై ఎన్‌ఎల్డీసీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే విద్యుత్‌ ఉత్పత్తికి ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ వ్యయం అవుతున్నది ఒక జాబితాను రూపొందిస్తుంది. ఆ తరువాత డిమాండ్‌ను బట్టి తక్కువ ధరకు లభించే విద్యుత్‌ను కేటాయిస్తుంది. దీని ప్రభావం రాష్ర్టాల్లోని జెన్‌కో ప్రాజెక్టులపై పడుతుంది. 

 జెన్‌కోలు ఉత్పత్తిని తగ్గించుకోవాలి!

మన రాష్ట్ర అవసరాలకు సరిపోయేలా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. దక్షిణాది గ్రిడ్‌ను సమర్థంగా నిర్వహించేలా జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తోడ్పడుతున్నాయి. ప్రతిపాదిత బిల్లు ప్రకారం ఎన్‌ఎల్డీసీ తక్కువ ధరకు లభించే విద్యుత్‌ను కేటాయించే పక్షంలో మన జెన్‌కో డిమాండ్‌ పడిపోతుంది. ఫలితంగా జెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ భారం అధికమై చివరకు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మూతపడినా ఆశ్చర్యపోనక్కరలేదని విద్యుత్‌ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

ఉత్తరభారతంలో ఇంకా పీపీఏలు కుదుర్చుకోని, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న కొన్ని జలవిద్యుత్‌ కేంద్రాలను పునరుత్పాదక ఇంధనం (రెన్యువబుల్‌ ఎనర్జీ) విభాగంలో చేర్చారు. ఈ విభాగంలో.. మనకు కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తున్న నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను చేర్చలేదు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లులో రాష్ర్టాలు కొంతమొత్తంలో తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న నిబంధన విధించింది. కేంద్రం నిర్దేశించే పునరుత్పాదక విద్యుత్‌ మొత్తాన్ని ఎన్‌ఎల్డీసీ రాష్ర్టాలకు కేటాయిస్తుంది. సహజంగానే ఈ కేటాయింపు ఉత్తరాదికి చెందిన ప్రాజెక్టులనుంచి జరుగుతుందనడంలో సందేహం లేదు. దీంతో నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో తక్కువ వ్యయంతో ఉత్పత్తవుతున్న విద్యుత్‌ను పూర్తిగా వినియోగించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోతుంది. తప్పనిసరిగా అధికధరకు ఉత్తరాదినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఫలితంగా జెన్‌కోకుచెందిన విద్యుత్‌ కేంద్రాలు బ్యాక్‌డౌన్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆ కేంద్రాల నిర్వహణ భారంగా మారి వాటి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం తలెత్తుతుంది. 

ప్రతిపాదిత బిల్లుతో విద్యుతరంగం కష్టాల్లోకి వెళ్తుందని.. రైతులు, గృహ వినియోగదారులకు ఆర్థిక భారం, విద్యుత్‌ సంస్థల్లోని ఉద్యోగుల తగ్గింపుతోపాటు.. జెన్‌కో కేంద్రాలు మూసివేత దిశగా ఎన్‌ఎల్డీసీకి ఇచ్చిన అధికారాలు ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం


కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్‌ చట్టం రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. కేంద్రం చర్యలు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయి.  ప్రస్తుతం ఎంతో సంక్షోభంలో ఉన్న ప్రజల వెన్ను విరిచేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. ఈ నల్లచట్టాన్ని అన్ని రాష్ట్రాలు ఏకతాటిపై నిలిచి వ్యతిరేకించాలి. మా పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంది.


- అసదుద్దీన్‌మజ్లిస్‌ పార్టీ అధినేత


logo