శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 01:59:36

లాక్‌డౌన్‌ సక్సెస్‌

లాక్‌డౌన్‌ సక్సెస్‌

-సామాజిక చైతన్యంతో సత్ఫలితం

-గత 8 రోజుల్లో తీవ్రత తగ్గుముఖం

-ఇదేస్ఫూర్తి ప్రదర్శిస్తే గట్టెక్కినట్టే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌వ్యాప్తికి భారత్‌ లాక్‌"డౌన్‌'తో కళ్లెంవేసింది. ముందస్తు అప్రమత్తతకు ప్రజల సహకారం తోడవడంతో విశ్వమారి దూకుడును అడ్డుకోగలిగింది. ఎనిమిది రోజులుగా దేశవ్యాప్తంగా స్వల్పంగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని రోజు లు ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తే కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇతర దేశాల అనుభవాలు, నిపుణుల సూచనలతో మన దేశంలో వైరస్‌ ప్రభావం గణనీయంగా తగ్గింది. కొవిడ్‌-19 పుట్టినిల్లయిన చైనాలో మొదటి కేసు ఈ ఏడాది జనవరి 22న నమోదైంది. ఒకేరోజు 571 కేసులు నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. ఫిబ్రవరి 15 వరకు 68,500, మార్చి 28 నాటికి ఆ సంఖ్య 81,439 కు చేరింది. ఇక, అమెరికాలో ఫిబ్రవరి 15న 15 కేసులతో ప్రారంభమైన ఈ మహమ్మారి వీరంగం.. మార్చి 28 నాటికి 1,23,578 కు చేరింది. ఇటలీలో ఫిబ్రవరి 15న మూడు కేసులు నమోదు కాగా.. మార్చి 28నాటికి 92,472కు చేరింది. స్పెయిన్‌లో ఫిబ్రవరి 15న రెండు కేసులే. మార్చి 28 నాటికి వాటిసంఖ్య 73,235కు చేరింది. ఫ్రాన్స్‌లో ఫిబ్రవరి 15న 12 కేసులు. మార్చి 28న 37,575 కేసులు. లండన్‌లో తొమ్మిది కేసులతో మొదలై ప్రస్తుతం 17,089 కేసులకు చేరుకున్నది.

ఫిబ్రవరిలో మూడు కేసులే..

భారత్‌లో జనవరి 30న తొలి కేసు నమోదవగా.. ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఒకటి చొప్పున పెరిగాయి. తిరిగి నెల తర్వాత మార్చి 2న రెండు కేసులు, 3న మరో కేసు వచ్చింది. మార్చి నాలుగున ఒకేరోజు 28 కేసులు నమోదయ్యాయి. క్రమంగా కేసుల సంఖ్య పెరిగి మార్చి 28 నాటికి 1,053కు చేరింది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనాను చాలావరకు నియంత్రించినట్టు కనిపిస్తున్నది. 


logo