శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:13

లాక్‌డౌన్‌ నష్టం 70,000 కోట్లు

లాక్‌డౌన్‌ నష్టం 70,000 కోట్లు

  • జీఎస్‌డీపీలో అది 7.9 శాతం
  • రాష్ర్టానికి ప్రత్యక్ష పన్నుల నష్టం రూ.7 వేల కోట్లు
  • నిర్మాణ, ఉత్పాదక, గనులరంగాల్లో 100% నష్టం
  • ఆపత్కాలంలోనూ పురోగమించిన వ్యవసాయం

‘సెస్‌'డాక్యుమెంట్‌లో వెల్లడి

కరోనా మహమ్మారి.. మన ఆరోగ్యాల్నే కాదు.. మన సమాజాన్నే ఆర్థికంగా ఆగంచేసింది. కొవిడ్‌ కట్టడికోసం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.9%గా ఉంటుందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అంచనావేసింది. పన్నుల రూపంలో రావాల్సిన రూ.7 వేల కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని తెలిపింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : విశ్వమారి కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ సమాజం వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ స్టడీస్‌ (సెస్‌) అంచనావేసింది. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. మంగళవారం సెస్‌ విడుదలచేసిన ఐదు పేజీల డాక్యుమెంట్‌లో ఏయే రంగాలు లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమయ్యాయో వివరంగా పేర్కొన్నది. వ్యవసాయ రంగం మినహా మిగతారంగాలన్నీ తీవ్రంగా ప్రతికూల ఫలితాలను చవిచూశాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో కీలకమైన నిర్మాణ, ఉత్పాదక రంగాలు నూరుశాతం లాక్‌డౌన్‌ ప్రభావానికి గురయ్యాయని పేర్కొన్నది. వీటితోపాటు గనులు, క్వారీలు కూడా నష్టపోయాయని నివేదిక తెలిపింది. 

ఉపాధిపై కరోనా కాటు

2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్థికాభివృద్ధిరేటు చాలా వేగంగా పురోగమించింది. వివిధ ప్రాధాన్యరంగాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడంతో జీఎస్డీపీలో వ్యవసాయరంగం 16%, పారిశ్రామిక రంగం 19%, సేవల రంగం 65% వాటాలతో ఆర్థిక వ్యవస్థ సుసంపన్నంగా ముందుకు సాగింది. ఈ తరుణంలో ముంచుకొచ్చిన కరోనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మాన్యుఫాక్చరింగ్‌, ఎంఎస్‌ఎంఈ, సర్వీసు రంగాలతోపాటు రియల్‌ రంగంపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. రాష్ట్రంలో పనిచేసే వారి వయసు (15-59 ఏండ్లు) కలిగిన వారి జనాభా 2.5 కోట్లు ఉంటుంది. 

రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 68.4% వీరే ఉంటారు. ఇందులో 1.34 కోట్ల మంది కార్మికులు. వీరిలో 31.91 లక్షల మంది దినసరి కూలీలు ఉన్నారు. 19.85 లక్షల మంది వ్యవసాయరంగంలో పనిచేస్తుండగా, 12.06 లక్షల మంది వ్యవసాయేతర రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే కార్మికులు లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లోని 40 శాతం కార్మికుల్లో 13% దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా  మొదటగా ప్రభావితమయ్యేది దినసరికూలీలే. 13,08,535 కూలీలు నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేకపోవడంతో వీరికి ఉపాధిలేకుండాపోయింది. 


రాష్ర్టానికి భారీ నష్టం

తెలంగాణ సమాజం లాక్‌డౌన్‌లో రోజుకు రూ.1,784 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా ఉత్పాదక, వ్యాపార, మరమ్మతు సేవలు, రియల్‌ ఎస్టే రంగాలు రోజుకు రూ.1200 కోట్లు నష్టపోయాయి. మొత్తంమీద రాష్ర్టానికి లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు రూ.70,000 కోట్లు నష్టం వచ్చింది. 2019-20 జీఎస్‌డీపీని పోల్చుకొంటే, 7.9 శాతం నష్టం ఉంటుందని అంచనా. 10% టాక్స్‌ జీఎస్‌డీపీ రేషియో చూసుకుంటే ప్రభుత్వానికి నేరుగా ఒక్క రోజుకు రూ.178.4 కోట్లు, మొత్తం లాక్‌డౌన్‌ సమయంలో రూ.7 వేల కోట్లు నష్టపోయిందని సెస్‌ అంచనా వేసింది. 

సంక్షోభం నుంచి త్వరగా బయటకు..

కరోనా కష్టాల నుంచి తెలంగాణ రాష్ట్రం త్వరగానే బయటపడుతుందని సెస్‌ ఆశాభావం వ్యక్తంచేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర, స్వయం ఉపాధి రంగాలనుంచి ఆర్థిక పునర్జీవ చర్యలను ప్రారంభించవచ్చని తెలిపింది. కంటైన్మెంట్‌ కాని ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలను ఎక్కువ దూరానికి తరలించి వ్యవసాయ పనులకు వినియోగించవచ్చని సూచించింది. నరేగా పథకాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లిన కూలీలకు పని కల్పించవ్చని పేర్కొన్నది. అసంఘటిత రంగంలోని స్వయం ఉపాధి పరిశ్రమలను షరతులమేరకు పనిచేసేందుకు అనుమతించాలని, మహిళాసంఘాలకు తక్కువ వడ్డీరేటుకు స్వల్ప రుణాలను మంజూరుచేయాలని కోరింది. ఇదే తీరుగా డిమాండ్‌, సరఫరా మధ్య వచ్చే వ్యత్యాసాలను అధిగమించాలని, వ్యవసాయదారులు, మహిళా గ్రూప్‌ల మధ్య స్థానిక సరఫరా చైన్‌ను అనుసంధానించాలని తెలిపింది. 


సుభిక్షంగా వ్యవసాయరంగం

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభావితం కాని రంగం వ్యవసాయం మాత్రమే. వ్యవసాయ పనులు ఏవీ కరోనా కారణంగా ఆగలేదు. ఫలితంగా ప్రజలకు తిండిగింజలతోపాటు పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బంది కలుగలేదు. వైరస్‌ భయంతో ప్రజలు మాంసాహారాన్ని తినడం తగ్గించడంతో ఆ రంగంపై మాత్రం 25% ప్రభావం పడింది. హోటల్‌ రంగం 80శాతం ప్రభావితమైంది.

రంగం : లాక్‌డౌన్‌లో నష్టం (శాతాల్లో) - సగటున ఒక్క రోజు నష్టం  (రూ. కోట్లలో)

పశుసంపద  :  25% - 45

ఫారెస్ట్రీ అండ్‌ లాగింగ్‌   : 50% - 5

మత్స్య పరిశ్రమ   : 50% - 6

గనులు, క్వారీ   : 100% - 75

ఉత్పాదక   : 100% - 253

నిర్మాణం   : 100% - 97

వ్యాపారం, మ రమ్మతులు   : 80% - 288 

హోటళ్లు, రెస్టారెంట్లు   : 80% - 25

రైల్వేలు   : 100% - 8

రోడ్డు రవాణా   :  100% - 98

వాయు రవాణా   :  100% - 4

సర్వీసెస్‌ ఇన్సిడెంటల్‌ ట్రాన్స్‌పోర్ట్‌   :  100% - 23

ఆర్థిక సేవలు   :  25% - 35

రియల్‌ ఎస్టేట్‌, ఓనర్సీప్‌ ఆఫ్‌ డ్వెల్లింగ్‌,  ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌    : 100% - 533

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌   : 50% - 51

 ఇతర సర్వీసులు   :  100% - 239

మొత్తం నష్టం సగటున ఒక్క రోజుకు 1784 కోట్లు

  • ప్రభావితమైన కార్మికుల పట్టిక
    • అతి తీవ్రం
    • తీవ్రం
    • కొంచెం
క్యాటగిరీ- సంఖ్య 
 పర్సంటేజ్‌ 

మొత్తం జనాభా (15-59 వయస్సు)

2,52,53,000 (వర్కింగ్‌)

68.4%

మొత్తం కార్మికులు (15-59)

1,34,60,000

53.3%

సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌

62,12,095

 46.2%

వేతన కార్మికులు 

40,57,055 

30.1%

వ్యవసాయ కూలీలు

19,85,000 

62%

వ్యవసాయేతర రంగం

12,06,000

38%

మొత్తం దినసరి కూలీలు 

31,91,000 

23.7%

పట్టణ స్వయం ఉపాధి

16,26,063 

29.8%

పట్టణ వేతన ఉద్యోగులు

31,10,972

57.1%

పట్టణాల్లో దినసరి కూలీలు

7,12,000 

13. 1%

పట్టణ కార్మికులు

54,49,146 

40.5%


logo