శనివారం 04 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 02:18:54

జూన్ 30 దాకా లాక్‌డౌన్‌ జోన్లలోనే కట్టడి

జూన్ 30 దాకా లాక్‌డౌన్‌ జోన్లలోనే కట్టడి

  • మిగిలిన చోట్ల 7 వరకు.. రాష్ట్రంలోనూ కేంద్ర మార్గదర్శకాలు
  • రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ
  • దుకాణాలు రాత్రి 8 గంటలవరకు ఓపెన్‌
  • అంతర్రాష్ట్ర రాకపోకలపై నియంత్రణ లేదు
  • సీఎస్‌, డీజీపీలతో చర్చించిన సీఎం కేసీఆర్‌
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
  • ఆఫీసులు, పని ప్రదేశాల్లో మరింత అప్రమత్తం 
  • ప్రతి ఉద్యోగికి జ్వర పరీక్షలు తప్పనిసరి
  • ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సూచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్రం సూచించిన సడలింపులు అమలుచేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్‌ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుం చి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని చెప్పారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై నియంత్రణ అవసరం లేదని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు లాక్‌డౌన్‌ సడలింపులపై సీఎస్‌ సో మేశ్‌కుమార్‌ ఆదివారం జీవో జారీచేశారు. కేం ద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్‌ జూన్‌ 30 వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కఠినంగా అమలవుతాయని స్పష్టంచేశారు. కంటైన్మెంట్‌ లేని ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. మే 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులన్నీ జూన్‌ 7 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో కొన్నింటికి మినహాయింపులు ఇస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు  కర్ఫ్యూ సమయంలో దవాఖానలు, మెడికల్‌ షాపులకు అనుమతి ఇచ్చారు. మిగతా అన్నిరకాల దుకాణాలు రాత్రి 8 గంటలవరకే తెరువాలని సూచించారు. ఇకపై ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి రావడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టంచేశారు.

పని ప్రదేశాల్లో అప్రమత్తం

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనాకు దూరంగా ఉండగలుగుతారని వైద్య విభాగాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, పని ప్రదేశాల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కార్యాలయాల్లో ప్రత్యేక విధానాలను అవలంబించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు సూచనలు చేసింది. కార్యాలయానికి వచ్చే ప్రతి ఉద్యోగి జ్వరాన్ని తప్పనిసరిగా పరీక్షించాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఉంటే అవి తగ్గే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పాలి. పని ప్రదేశంలో గాలి, వెలుతురు బాగా ఉండేలా ఏర్పాట్లుండాలి. శానిటైజర్‌ అందుబాటులో ఉండాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు సోడియం హైపోక్లోరైట్‌తో టేబు ళ్లు, డోర్‌ హ్యాండిల్స్‌, హ్యాండ్‌ రేలింగ్‌, నల్లాలు వంటివి శుభ్రం చేయాలి. ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించినా లేదా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలినా మొత్తం ప్రాంగణాన్ని డిస్‌ ఇన్ఫెక్ట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. కరోనాపై ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కార్యాలయంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలి. వైరస్‌ సోకకుండా జాగ్రత్త చర్యలు అమలయ్యేలా కార్యాలయంలో నోడల్‌ అధికారిని నియమించాలి.

ఉద్యోగులు వ్యక్తిగతంగా..

కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క రూ మాస్క్‌ ధరించాలి. పేపర్లు, ఫైళ్లు, నగదు వంటివి తాకిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. తోటి ఉద్యోగులకు 3 నుంచి 5 అడుగుల దూరం ఉండాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు దస్తీ లేదా టిష్యూను అడ్డు పెట్టుకోవాలి. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్‌ కీబో ర్డు, మౌస్‌ వంటివి ప్రతి 8 గంటల్లో రెండుసార్లు శానిటైజర్‌తో శుభ్రంచేయాలి. రోగనిరోధకశక్తి పెరిగే పోషకాహారాన్ని తీసుకోవాలి. వ్యాయా మం చేయాలి. లిఫ్ట్‌లను సాధ్యమైనంత వరకు ఉపయోగించొద్దు. లిఫ్ట్‌కు ఎడమచేయి లేదా మోచేతిని వాడాలి.

ఇతర రాష్ర్టాలకు ఆర్టీసీ బస్సులు?

హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు ఇకపై ఇతర రాష్ర్టాలకు వెళ్లనున్నాయి. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోం శాఖ ఎత్తివేయడంతో రాష్ర్టాల మధ్య బస్సు సేవలు ప్రారంభంకానున్నాయి. కరోనా కేసుల విషయంలో పలు రాష్ర్టాల్లో తేడాలు ఉండటంతో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆయా రాష్ర్టాల సమన్వయంతో బస్సులు నడిపించాల్సి ఉంటుందని, ఇతర రాష్ర్టాలకు బస్సులు ప్రారంభించాలా వద్దా అనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. 

తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 400 నుంచి 500 వరకు అంతర్రాష్ట్ర బస్సులు నడుస్తుంటాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు రాకపోకలు సాగిస్తుంటాయి. నిర్ణీత పట్టణాలకు శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేక బస్సులను నడుపుతుంటారు. తెలంగాణ నుంచి ఎక్కువగా విజయవాడ, బెంగళూరు, శ్రీశైలం, రాయ్‌చూరు, ముంబై, చన్నైలకు బస్సులు వెళ్తుంటాయి. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, గురుడ ప్లస్‌ బస్సులు సేవలందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా రాష్ర్టాల బస్సులు తెలంగాణకు వస్తుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా పలు రాష్ర్టాల్లో ఎంతో మంది చిక్కుకుపోయి ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభమైతే రాకపోకలకు మార్గం సుగమవుతుందని భావిస్తున్నారు.

కంటైన్మెంట్‌ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలి. రాత్రి 8 గంటల వరకే దుకాణాలు తెరువాలి. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఎలాంటి నియంత్రణ అవసరం లేదు.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


logo