బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 25, 2021 , 02:10:16

లోకల్‌ ఫుడ్‌ భలే రుచి

లోకల్‌ ఫుడ్‌ భలే రుచి

  • హరిత హోటళ్లలో స్థానిక వంటకాలు
  • లొట్టలేసుకొని తింటున్న టూరిస్టులు
  • లాభాలబాటలో రెస్టారెంట్లు
  • పర్యాటకుల కోసం స్థానికులతో తయారీ
  • జొన్నరొట్టె.. చేపలపులుసు అదరహో!
  • టూరిస్ట్‌ రెస్టారెంట్ల లాభాల బాట

జొన్న రొట్టె, చేపల పులుసు కాంబినేషన్‌.. ఎప్పుడో ఊళ్లో ఉన్నప్పుడు తిన్నాం.. ఉరుకులు పరుగుల జీవితంలో ఆ రుచులే మర్చిపోయాం! అని బాధపడుతున్నారా? పదండి నల్లమల వెళ్దాం.. అటవీ అందాలను చూద్దాం.. అక్కడి హరిత హోటల్‌లో బసచేద్దాం.. చెంచుల చేతివంట రుచిచూద్దాం.. నోరు చప్పబడి పోయిందా..? స్పైసీగా ఏమైనా తినాలనుందా..? పచ్చిమిర్చి కాంబినేషన్‌లో వండిన చిక్కుడుకాయ సూపరంటున్నారు ములుగు జిల్లా తాడ్వాయికి వచ్చిన పర్యాటకులు. ఇలాంటి స్థానిక రుచులకు హరితహోటళ్లు నిలయంగా మారుతున్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన రెసిపీలు దొరుకుతుండటంతో హరిత హోటళ్లలో రద్దీ పెరుగుతున్నది.


హైదరాబాద్‌, జనవరి 24 (నమస్తే తెలంగాణ): పర్యాటకులకు స్థానిక వంటకాల రుచి చూపించేందుకు వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నది రాష్ట్ర పర్యాటకశాఖ. ఈ ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తున్నది. దీంతో హరిత రెస్టారెంట్ల నిర్వహణ బాధ్యతను స్థానికంగా ఉండే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 రెస్టారెంట్లను ప్రైవేటుకు ఇచ్చే యోచనలో ఉన్నది. గతేడాది వరకు రూ.1.7 లక్షల నష్టాల్లో ఉన్న నిజామాబాద్‌ హరితహోటల్‌ ప్రైవేటుకు ఇచ్చాక రూ.3 లక్షల లాభాల్లోకి వచ్చింది. ఇదే ప్రాతిపదికన ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. గతంలో సగం జీతాలే ఇచ్చిన ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించడం సాధ్యమవుతున్నదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 20 ఏండ్లుగా హోటళ్లు లీజుకు ఇస్తున్నామని, స్వదేశీదర్శన్‌ కింద కొ త్తగా నిర్మించిన హోటళ్ల నిర్వహించాలని కేంద్ర నిబంధన పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లకు డిమాండ్‌ పెరుగుతున్నది.


ఆరు నెలలుగా స్థానికులతో వంటలు చేయిస్తున్నాం. నాటుకోడి కూర, జొన్నరొట్టె, సర్వపిండి తదితర స్థానిక వంటకాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.  

-సుమన్‌, ఇంచార్జి యూనిట్‌ మేనేజర్‌, హరిత తాడ్వాయి

ఆలూ కర్రీ అదిరింది!

వరంగల్‌లోని భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాలు, తాడ్వాయి అడవులు, మేడారం జాతర, లక్నవరం చూడటానికి వచ్చాం. అన్ని ప్రాంతాలను చూసుకొని రాత్రి తాడ్వాయిలోని హరిత హోటల్‌లో బసచేశాం. అక్కడ పచ్చిమిర్చి కాంబినేషన్‌లో వండిన చిక్కుడుకాయ, ఆలూ కర్రీలు చాలా రుచిగా ఉన్నాయి. ఆరా తీస్తే అక్కడి గిరిజనులు ఆ వంటకాలను చేసినట్టు తెలిసింది. అంత రుచిగా చేస్తారనుకోలేదు. ఇకపై ఎప్పుడైనా హరిత హోటల్‌కే వెళ్తాం.

 - 35 మంది ఐటీసీ హోటల్‌ ప్రతినిధులు 

 జొన్నరొట్టె, చేపల పులుసు సూపర్‌

సోమశిల సొబగులు చూసేందుకు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ వెళ్లాం. దాదాపు పది కుటుంబాల వాళ్లం.. అంటే 30 మందిమి అక్కడి హరితహోటల్‌లో మూడు రోజులపాటు బసచేశాం. అందులో రెస్టారెంట్‌ లేదు. ఆ ఊరోళ్లు చేసిన వంటలే తిన్నాం. వాళ్లు చేసిన వంటకాల్లో జొన్నరొట్టె, చేపల పులుసు సూపర్‌! ధర కూడా చాలా తక్కువ. సాధారణంగా రెస్టారెంట్‌లో 30 మందిమి తింటే రూ. 20 వేలు ఖర్చయ్యేవి. అక్కడ మా వద్ద రూ. 3,500 నుంచి నాలుగు వేలే తీసుకున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రుచికరమైన వంటకాలను ఆరగించడం ఓ మధురానుభూతి. 

- గోపాల్‌రావు, పర్యాటకుడు, హైదరాబాద్‌

తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తున్నాం 

తాడ్వాయి హట్స్‌కు వచ్చే వారికి స్థానికులతో వంటలు చేయిస్తుంటాం. కరోనాతో మూతపడిన తాడ్వాయి హరిత హోటల్‌ తెరచుకోడానికి సమయం పడుతుంది అని తెలిసింది. అందుకే ఉన్నతాధికారులను సంప్రదించిఆరు నెలలుగా స్థానికులతో వంటలు చేయిస్తున్నాం. నాటుకోడి కూర, జొన్నరొట్టె, సర్వపిండి తదితర స్థానిక వంటకాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.  

-సుమన్‌, మేనేజర్‌, హరిత తాడ్వాయి

VIDEOS

logo