శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 02:55:02

పాడిపశువుకు 75వేలు.. కోళ్లకు 30వేలు

పాడిపశువుకు 75వేలు.. కోళ్లకు 30వేలు

  • ఎస్‌హెచ్‌జీలకు స్త్రీనిధి రుణాలు
  • ఎలక్ట్రిక్‌ ఆటోల కొనుగోలుకూ రుణం
  • సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళాసంఘాల సభ్యుల అభ్యున్నతికి ఈ ఆర్థిక సంవత్సరం అమలుచేయాల్సిన పథకాలపై స్త్రీనిధి పాలకవర్గం గురువారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. సభ్యులకు పాడిపశువు కొనుగోలుకు రూ.75 వేలు, పెరటి కోళ్ల పెంపకానికి రూ.30 వేలు అందించాలని నిర్ణయించింది. స్త్రీనిధి అధ్యక్షురాలు అనిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, మహిళా అభివృద్ధి సొసైటీ ముఖ్యకార్యనిర్వహణాధికారి సీఎస్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ ఆటోల కొనుగోలుకు రుణం, బీమా పథకం అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ..

పాడిపశువుల కొనుగోలుకు రూ.75 వేలు: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరం 50వేల పశువులు (మేలు జాతి ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల)కోసం రుణాలు అందించాలి. ఒక్కో పాడిపశువుపై రూ.75వేలు రుణం ఇవ్వాలి. ఇతర రాష్ర్టాల నుంచి వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పెరటి కోళ్ల పెంపకం: స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం సమకూర్చడం కోసం 5వేల యూనిట్లకు రుణాలు అందించాలి. ఒక్కో యూనిట్‌లో 50 నుంచి 100 కోళ్లు పెంచటానికి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు రుణం ఇవ్వాలి. 2వేల కోడి పిల్లల 150 మదర్‌ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని రుణంగా సమకూర్చాలి.

ఎలక్ట్రిక్‌ ఆటోల కొనుగోలు: పర్యావరణ పరిరక్షణకు మేలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రికల్‌ ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందించాలి. ప్రతి జిల్లాలో కనీసం 30 యూనిట్లు నెలకొల్పాలనే లక్ష్యం. ప్రజా రవాణా లేదా సరకు రవాణాకు ఈ ఆటోలను వినియోగించవచ్చు.

కస్టం హైరింగ్‌ కేంద్రాలు: వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలి. రాష్ట్రంలో 100 కేంద్రాలు నెలకొల్పాలి. ఈ కేంద్రాలు నెలకొల్పటానికి మండల సమాఖ్యలకు రూ.25 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి.

సభ్యులకు బీమా: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల కోసం స్త్రీనిధి సురక్ష పథకం అమలుచేయాలి. దీనిద్వారా సంఘ సభ్యులకు రూ.లక్ష వరకు బీమా చేయవచ్చు. ఒక సభ్యురాలు సంవత్సరానికి రూ.230 చొప్పున 3 సంవత్సరాలకు రూ.690 కట్టి పథకంలో చేరాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరేందుకు అయ్యే మొత్తాన్ని రుణంగా ఇస్తారు. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే ఆమె వారసులకు రూ.లక్ష చెల్లిస్తారు.

  • స్త్రీనిధిలో అప్పు పొందాలనుకునే సభ్యులను ఆధార్‌తో అనుసంధానించి బయోమెట్రిక్‌ ద్వారా ధ్రువీకరించడంతోపాటు, సంబంధిత సంఘాల నుంచి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రుణ పత్రాలను ఇస్తారు. దీనిద్వారా రుణం పొందటం మరింత సులభం అవుతుంది.
  • స్వయం సహాయక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సభ్యులకు రుణాలు మరింత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
  • స్త్రీనిధి సంఘాలకు మంజూరు చేసే రుణ మొత్తాలను సంఘం ఖాతాలకు జమచేసే విధానంలో మార్పు చేసి, సంఘం సమ్మతితో నేరుగా సభ్యురాలి బ్యాంక్‌ పొదుపు ఖాతాకు జమ చేయాలని నిర్ణయించారు.