ఆదివారం 31 మే 2020
Telangana - May 21, 2020 , 01:46:57

నేర్చుకుంటూ.. నేర్పుతూ!

నేర్చుకుంటూ.. నేర్పుతూ!

  • డిజిటల్‌ బోధనలో విద్యార్థుల దూకుడు
  • విజయవంతమైన ‘లిటిల్‌ టీచర్స్‌' కాన్సెప్ట్‌
  • ప్రభుత్వ స్కూళ్లవారీగా వాట్సాప్‌ గ్రూపులు
  • అన్ని జిల్లాలకు విస్తరించిన ఆన్‌లైన్‌ పాఠాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విరామ సమయాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా టెన్త్‌ విద్యార్థులు డిజిటల్‌ పాఠాల బోధన, ప్రిపరేషన్‌లో దూసుకుపోతున్నారు. అధికారులు కొత్తగా తెచ్చిన ‘లిటిల్‌ టీచర్స్‌' విధానంలో ఓ వైపు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూనే.. మరోవైపు వీడియోలు రూపొందిస్తున్నారు. వాటినే స్కూల్‌వారీ వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టుచేస్తున్నారు. తద్వారా గ్రూపులో మిగిలిన సభ్యులు నేర్చుకోవడానికి వెసులుబాటు కలుగుతున్నది. ఈ ప్రక్రియను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడానికి సబ్జెక్టు టీచర్లకు అవకాశం కలుగుతున్నది. ఈ విధానం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. కేజీబీవీల్లో టెన్త్‌ విద్యార్థులు కూడా డిజిటల్‌ పాఠాలు నేర్చుకోవడంలో పోటీ పడుతున్నట్టు పేర్కొన్నారు.

లోకల్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పాఠాలు 

జిల్లా విద్యాధికారులు (డీఈవో) టెన్త్‌ విద్యార్థులకు లోకల్‌ టీవీ ద్వారా డిజిటల్‌ పాఠాలను అందుబాటులోకి తెచ్చారు. టెన్త్‌తోపాటు తొమ్మిదో తరగతి విద్యార్థులు కూడా ఈ పాఠాలు నేర్చుకుంటున్నారు. వాట్సాప్‌, టీవీ కార్యక్రమాల్లో 18 వేల మంది సబ్జెక్టు టీచర్లు , 2,98,183 విద్యార్థులు పాలుపంచుకుంటున్నారు. కేజీబీవీల్లో 2,375 ఉపాధ్యాయులు, 38 వేలమంది విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. మొ త్తంగా 3,56,558 మంది పాల్గొంటున్నారు.

అందుబాటులోకి టీసాట్‌ పాఠాలు

ఇప్పటికే పాఠశాల విద్యాశాఖలో టీసాట్‌, దూరదర్శన్‌ యాదగిరి ద్వారా డిజిటల్‌ పాఠాలు అందిస్తున్నారు. మరోవారంపాటు యాదగిరి టీవీ ద్వారా ప్రసారాలను అందిస్తామని ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా విద్యార్థులు మాత్రమే జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో పాఠాలను అందిస్తున్నారు. డిజిటల్‌ విధానంలో పాఠాలు అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.logo