ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 03:02:16

నేటినుంచి మద్యం అమ్మకాలు

నేటినుంచి మద్యం అమ్మకాలు

  • 10 నుంచి సాయంత్రం 6 దాకా
  • భౌతిక దూరం  లేకుంటే మూతే
  • మాస్కు  ఉంటేనే మద్యం అమ్మకం
  • సగటున 16 శాతం ధరల పెంపు
  • కంటైన్మెంట్లలోని షాపులు తప్ప అన్నీ తెరుస్తం
  • బార్లు, పబ్బులు, క్లబ్బుల్ని తెరిచేదిలేదు
  • మీడియాతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప రాష్ట్రంలోని మిగతా మద్యం షాపులన్నీ బుధవారం నుంచి తెరుస్తమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రెడ్‌ జోన్‌ జిల్లాల్లో కూడా మద్యం దుకాణాలు తెరుస్తరు. రాష్ట్రంలో 2200 పైచిలుకు మద్యం దుకాణాలుంటే అందులో కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప మిగిలినవన్నీ తెరుస్తరు. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బుల్ని ఎట్టి పరిస్థితుల్లో తెరిచేదిలేదు. మద్యం ధరలు సరాసరి 16 శాతం పెంచుతం. పేదలు తాగే చీప్‌ లిక్కర్‌ మీద 11 శాతం, ఎక్కువ ధర ఉండే మద్యం మీద కాస్త ఎక్కువ పెంచుతం. 

ఈ పెంపుదల తక్కువ కాదు. వెనక్కి తీసుకునేది లేదు. ఇతర రాష్ర్టాల్లో 70 శాతం పెంచినరనే చర్చ కూడా జరిగింది. కానీ అట్ల పెంచొద్దు. మొత్తం కొంపలు అమ్మే పరిస్థితి వస్తది. అందుకే సాధారణంగా పెంచమని చెప్పినం. సరిహద్దులుగా ఉన్న నాలుగు రాష్ర్టాల్లో మద్యం దుకాణాలు తెరిచేసరికి ఇక్కడోళ్లు అక్కడికి పోవడం మొదలైంది. తర్వాత మద్యం స్మగ్లింగ్‌ మొదలైతది. ఈ మద్యం లోడ్స్‌లో బిల్లులు లేకుండా సెకండ్స్‌ అనేవి కూడా మొదలైతయి. అందుకే ఇక్కడ ఉన్న బేవరేజెస్‌ (మద్యం ఉత్పత్తిదారులు) వాళ్లు మేం ఇక్కడ పైసలు కడుతున్నం అని గొడవ పెట్టడం మొదలుపెట్టిండ్రు. దేశమంత తెరుస్తున్నరు, మీరు తెర్వకపోతే ఎట్ల అని అంటున్నరు. అన్నింటి దృష్ట్యా ఆలోచించినపుడు మద్యం దుకాణాలు వందశాతం తెరవడం తప్ప వేరే గత్యంతరం లేదు. క్యాబినెట్‌లోనూ తెరవాలని నిర్ణయం తీసుకున్నం. బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుస్తరు. ఒక్కరోజు ఆలస్యం చేసినా విషం పెంచుకున్నట్లే. ఈ స్మగ్లింగు, సెకండ్స్‌ మొదలైతయి. మళ్ల ఆ గొలుసును ఛేదించాలంటే చాలా సమయం పడుతుంది. 

ఆగమాగం చేస్తే దుకాణం బంద్‌

వైన్స్‌ దుకాణ యజమానులు, కొనుగోలు చేసెటోళ్లకు హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాలి. ఎక్కడైనా భౌతికదూరం పాటించలేదని దొరికితే గంటల్లోపే ఉత్తర్వులు ఇచ్చి మూసేస్తం. 12 గంటలు తెరిచే ఉన్నందున కొనుక్కోవచ్చు కదా. అంత గడబిడ ఎందుకు? తెలంగాణ సమాజం క్రమశిక్షణ చూపించాలి. మన వైద్యులు అహోరాత్రులు కష్టపడుతున్నరు. ఒకరిమీద ఒకరు పడి ఆగమాగం చేయొద్దు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు షాపు ఉంటది. కంగారు కంగారుగా కొనుక్కోవాలా? ఏం అక్కర ఉంది. కాబట్టి పిచ్చిపిచ్చిగా చేస్తే షాపులు క్యాన్సల్‌ చేస్తం. షాపు ఓనర్లు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 


మూడేండ్లలో గుడుంబాలేని తెలంగాణ చేసినం

మూడేండ్లు పోలీసులు, ఎక్సైజ్‌శాఖ, జిల్లాల కలెక్టర్లు అందరం కలిసి రాష్ట్రంలో గుడుంబా పీడ లేకుండ చేసినం. నేను వరంగల్‌ పర్యటన పోతే.. అక్కడ అన్నీ గుడుంబా బట్టీలు. పగటపూటనే తాగి సభకు వచ్చినరు. తండాల దొరికితే తాగొచ్చిండ్రా అని నేనంటే.. లేదు సార్‌ వరంగల్‌ పట్టణంలో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని చెప్పినరు. మరి ఏం చేయాలంటే.. కనీసం సారా అన్న పెడితే తాగి సావకుండనన్న ఉంటరని చెప్పినరు. చాలామంది వితంతువులు అవుతున్నరని మహిళలు బాధపడి చెప్పినరు. నేను హైదరాబాద్‌కు వచ్చి ఏం చేయాలని అందరినీ అడిగితే.. సారా వద్దు సార్‌, చీప్‌ లిక్కర్‌ తెస్తే బాగుంటదని అన్నరు. అప్పుడు చీప్‌ లిక్కర్‌ తెచ్చి గుడుంబా నిర్మూలన చేసినం.ప్రత్యామ్నాయ ఉపాధి కోసం మూడేండ్లపాటు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేసినం. చావులు ఆగిపోతే సంతోషపడినం. 

ఇటు గుడుంబా... అటు సరిహద్దు మద్యం

కరోనా వచ్చిందని మద్యం బంద్‌ పెట్టినం. ఇబ్బంది అవుతుందని వైన్స్‌, పబ్బులు, బార్లు బంద్‌ చేసినం. దాదాపు 43-44 రోజులు విజయవంతంగా లాక్‌డౌన్‌తో బంద్‌ అయినవి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో చుట్టూ ఉన్న నాలుగు రాష్ర్టాల్లో వైన్స్‌ తెరిచినరు. తెలంగాణకు మొత్తం 2300 కిలోమీటర్ల ఇతర రాష్ర్టాల సరిహద్దు ఉన్నది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌తో 890 కి.మీ., మహారాష్ట్రతో దాదాపు 700 కి.మీ.లపైగా, కర్ణాటకతో 490-500 కి.మీ.పాటు ఛత్తీస్‌గఢ్‌తో 235 కి.మీ. వరకు సరిహద్దు ఉంటది. సరిహద్దు ఉన్న ప్రాంతాల్లోని వాళ్లు పోయి అక్కడ లైన్‌ కట్టినరు. పత్రికల్లో ఫొటోలు కూడా వచ్చినయి. వాళ్లమంది, మన మంది కలిసి అక్కడ బహిరంగ సభ పెట్టినట్టయింది. ఇటు గుడుంబా మొదలై కొంపలు ముంచేటట్టుంది.

మాస్క్‌ ఉంటేనే మద్యం

నోమాస్క్‌ నోలిక్కర్‌ అని ఎక్సైజ్‌ మంత్రి చెప్తున్నరు. అలాగే నోమాస్క్‌, నో గూడ్స్‌ అని నేను చెప్తున్న. కిరాణా షాపులకు, కూరగాయల షాపులకు మాస్క్‌ లేకుండా వస్తే మాత్రం గ్యారంటీగా చర్యలు ఉంటయి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. ఇంట్లో కాటన్‌ మాస్కులు కూడా పెట్టుకోవచ్చు. షార్టు పీరియడ్‌లో కోటి మాస్కులను పంపిణీచేస్తారు. వృద్ధ పేషెంట్లకు గ్యారంటీగా వస్తయి. మిగిలిన వారు మీకు మీరు తయారుచేసుకోండి. టవల్‌, కాటన్‌ పంచెలు కూడా కట్టుకోవచ్చు. ప్రైమ్‌ మినిస్టర్‌ కూడా కట్టుకున్నడు కదా.. సిరిసిల్ల నుంచి వస్తే రేపో ఎల్లుండే నేను కూడా కడుతా. కొద్దిగా కష్టపడితే బయటపడే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. మనకంటే ఎక్కువ చేసిన కేరళ రాష్ట్రం వాళ్లు చాలా సీరియస్‌గా చేసిండ్రు. మన కరీంనగర్‌ నుంచి నేర్చుకున్నరు. బాగా చేసిండ్రు. ఫలితం వచ్చింది. ఇబ్బందైతే లేదు. కంట్రోల్‌ అయింది. ఆ స్టెప్పులో మనం కూడా ఉన్నాం. అట్లా కొన్ని రాష్ర్టాలు కూడా ఇండియాలో ఉన్నాయి.


logo