మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 11:38:39

'పెద్ద‌గ‌ట్టు' జాత‌ర తేదీలు ఖ‌రారు

'పెద్ద‌గ‌ట్టు' జాత‌ర తేదీలు ఖ‌రారు

సూర్యాపేట‌ : తెలంగాణ రెండో అతిపెద్ద కుంభ‌మేళా పెద్ద‌గ‌ట్టు జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే శ్రీలింగ‌మంతుల స్వామి(పెద్ద గ‌ట్టు) జాత‌ర ఏర్పాట్ల‌పై దేవాదాయ శాఖ అధికారులు, యాద‌వ కుల‌పెద్ద‌ల‌తో విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యులు బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌ స‌మావేశ‌మై చ‌ర్చించారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 28 నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు జాత‌ర నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. జాత‌ర ప్రారంభానికి ముందు ఫిబ్ర‌వ‌రి 14న దిష్టిపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. మాఘ‌శుద్ధ త‌దియ త‌ర్వాత వ‌చ్చే రెండో ఆదివారం దిష్టికుంభాన్ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా చీక‌టాయ‌పాలెం నుంచి దేవ‌ర‌పెట్టెను తీసుకురాగా, సూర్యాపేట నుంచి మ‌క‌ర‌తోర‌ణం, ఇత‌ర ఆభ‌ర‌ణాలు పెద్ద‌గ‌ట్టుకు తీసుకొచ్చి అలంక‌ర‌ణ చేయ‌నున్నారు. 2021, ఫిబ్ర‌వ‌రి 28న ఆదివారం రోజు జాత‌ర ప్రారంభ‌మై ఐదు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను, జాత‌ర నిర్వాహ‌కుల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

ఈ స‌మావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పి టిసి జీడీ బిక్షం, కౌన్సిలర్  జటావత్ లక్ష్మీ మకట్ లాల్, దేవాదాయ శాఖ అధికారులతో పాటు పూజారులు మెంత బోయిన నాగయ్య, గొర్ల గన్నారెడ్డి, వెంకన్న, జటంగి నాగరాజు యాదవ్, కోడి సైదులు యాదవ్, వెంకన్నయాదవ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతర  కార్యక్రమాలు

ఫిబ్రవరి 14న దిష్టి పూజ.

ఫిబ్రవరి 28 ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుంచి దేవర పెట్టె  తీసుకువచ్చి, గంపల ప్రదిక్షణ చేస్తారు. 

మార్చి 1న‌ సోమవారం, బోనాలు సమర్పించుట ముద్దెర పాలు, జాగిలాలు.

మార్చి 2న చంద్రపట్నం.

మార్చి 3న పూజారులు నెలవారం చేయుట.

మార్చి 4న గురువారం, జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపు.