ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 13:10:11

గోదావరి నుంచి కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీల నీరు

గోదావరి నుంచి కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీల నీరు

హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నది అని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు. 

ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది. శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుంది. ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజుల పాటు నీరందించడానికి సమ్మక్క బ్యారుజి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేవిధంగా ప్రభుత్వం సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసింది. త్వరలోనే ఈ బ్యారేజి పనులు ప్రారంభం అవుతాయని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 

తెలంగాణాలో నీటిపారుదల రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని చెప్పడానికి, ఇప్పటికిప్పుడు మన కళ్లముందు సాక్షాత్కారిస్తున్న నిలువెత్తు నిదర్శనం ఈ యాసంగిలో వరి సాగులో తెలంగాణ సాధించిన పురోగతి. తెలంగాణలో యాసంగి పంట సమయంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు. నీటి పారుదల రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి వల్ల ఈ యాసంగి సీజన్ లో వరి పంట సాగు 38,19,419 ఎకరాలుగా వ్యవసాయశాఖ నమోదు చేసింది. యాసంగి సమయంలో 123.5 శాతం పెరిగిన వరి విస్తీర్ణం రాష్ట్రం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తున్నది అని గవర్నర్ పేర్కొన్నారు. 


logo