శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 18, 2020 , 01:20:56

రాత మార్చుతున్న కరోనా!

రాత మార్చుతున్న కరోనా!

  • మనిషి అనుక్షణం అప్రమత్తం
  • నిత్యావసరాల్లోకి కొత్త వస్తువులు
  • పౌష్ఠికాహారంవైపు అడుగులు
  • భౌతిక దూరానికి ప్రాధాన్యం
  • కొవిడ్‌-19తో మారుతున్న జీవనశైలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఊహించనిరీతిలో వచ్చి పడిన కరోనా.. మనిషి జీవితాన్ని అన్ని విధాల ప్రభావితంచేసింది. మొన్నటిదాకా సంఘజీవిగా ఉన్న మనిషి జీవనశైలిని ఒంటరిజీవిగా మార్చివేసింది. ఇది అతని వర్తమానాన్నే కాకుండా భవిష్యత్తును కూడా తల్లకిందులు చేస్తున్నది. నేడో రేపో కరోనా తొలిగిపోతుందని గత రెండు మూడునెలలుగా ఎదురుచూసి విసిగిపోయిన సమాజాలు అది మరింత విజృంభిస్తుండటంతో.. దానితో సహజీవనం సాగించేందుకే సిద్ధపడుతున్నాయి. అందుకనుగుణంగా వ్యవహారశైలిని, జీవన విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోంతో తొలుత ఉద్యోగ విధానంలో వచ్చిన మార్పులు.. ఆన్‌లైన్‌ పాఠాలతో విద్యావ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు క్రమంగా అన్ని రంగాలకూ విస్తరించనున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. కరోనా కాలంలో కనిపిస్తున్న దారులను అవకాశంగా మలుచుకొని ముందుకుసాగాలని సూచిస్తున్నారు. 

పెరిగిన వ్యక్తిగత పరిశుభ్రత


కరోనా కాటుతో నేడు ప్రతి ఒక్కరూ శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. భౌతికదూరం పాటిస్తున్నారు. పాశ్చాత్య పోకడలు వదిలి పౌష్టికాహారాన్ని వండుకుని మరీ తింటున్నారు. తెలియని వారితో మాట్లాడేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. కరోనాభూతం ఏ దిక్కు నుంచి వచ్చి కాటేస్తుందో అని అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నిత్యావసర సరుకుల జాబితాలో కరోనా మరికొన్నింటిని చేర్చింది. శానిటైజర్‌, హ్యాండ్‌వాష్‌, మాస్కులు, చేతి తొడుగులు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచే ఇతర రసాయనాలు వంటివి తీసుకోవడం తప్పనిసరిగా మారింది. రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణగా హెల్మెట్‌ ధరించాలంటూ పదేపదే చెప్పినా లెక్క చేయనివారిని కరోనా వైరస్‌.. మాస్కులను కచ్చితంగా ధరించేలా చేసింది. ఇక ఎక్కడైనా భౌతికదూరం పాటించాల్సిందే. కూర్చున్నా.. నిలుచున్నా.. ఎక్కడైనా రెండుసీట్ల మధ్య ఒకసీటు ఖాళీ ఉండాల్సిందే. చైనాలోని వుహాన్‌లో ఇప్పటికే ఈ విధానంలో పాఠశాలలు, ప్రయాణ సేవలు ప్రారంభమయ్యాయి.

గ్రూపు మీటింగ్‌లకు గుడ్‌బై

పని ముగిశాక, లేదా ఇల్లుచేరాక దోస్తులు, చుట్టుపక్కలవారితో గ్రూపు మీటింగ్‌లకు ఇక గుడ్‌బై చెప్పినట్టే. సరదాగా మాట్లాడుతూ చేసే కాలక్షేపానికి కాలం చెల్లింది. భౌతికదూరం పాటించడం, గుంపులుగా ఒకేచోట గుమిగూడకుండా ఉండాలనే నిబంధనలతో సాంకేతికత ద్వారానే ఎక్కువగా కనెక్ట్‌ అయ్యేకాలం వచ్చింది. అలయ్‌ బలయ్‌లకు దూరంగా హాయ్‌, బాయ్‌ అని చెప్పుకొంటున్నారు. జీవితంపై ఆశ చివరికి దేవుడిని కూడా దూరం చేసింది. గుంపులుగా ఆలయాలకు వెళ్లి పూజించే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని పూజగదిలోనే మొక్కులు తీర్చుకుంటున్నారు.

నిబంధనల మధ్యే షాపింగ్‌

కరోనా ప్రభావం వీకెండ్‌ షాపింగ్‌పై తీవ్రంగా పడనున్నది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులు లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అపాయింట్‌మెంట్‌ బేస్డ్‌ షాపింగ్‌ వంటివి అందుబాటులోకి రానున్నాయి. ట్రయల్‌ రూమ్స్‌ లేకుండానే షాపింగ్‌ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. వస్తువుల ఎక్స్‌చేంజ్‌ విషయంలోనూ జాగ్రత్తలు పాటించనున్నారు.

పెరుగనున్న వర్క్‌ ఫ్రం హోం


ఆఫీసుకు వెళ్లాలి.. విధులు నిర్వర్తించాలి అనే రోజులు పోతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఆఫీసులు తెరుచుకోలేదు. దీంతో కంపెనీలు పని కొనసాగించేందుకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అనుసరించి, మంచి ఫలితాలు సాధించాయి. 2021 వరకు ఎవరూ ఆఫీస్‌లకు రావాల్సిన అవసరంలేదని ఇప్పటికే గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ప్రకటించాయి. అన్ని కంపెనీలు ఇదే దారిలో నడిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం కాలంలో కేవలం ఓ ల్యాప్‌టాప్‌, దానికి ఇంటర్నెట్‌ ఉంటే చాలు.. హాయిగా నచ్చిన చోట ఉద్యోగాలు చేసుకోవచ్చు. ట్రాఫిక్‌, కాలుష్యం మధ్య పట్టణాల్లో నివసించాలనుకునే వారి సంఖ్య దీంతో తగ్గుముఖం పట్టనుంది. పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ, నగరాల్లో ఉండే బదులు సొంతూళ్లకు వెళ్లి కుటుంబంతో కలిసి ఉంటూ.. పనిచేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికి తోడు వ్యవసాయం, సహా ఇతర పనులు చేసుకునేందుకు అవకాశం లభించనున్నది. ఉద్యోగాలు ఇంటర్వ్యూలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో మొదలయ్యాయి. ప్రతిభ ఉన్నవారికి ఏ దేశంలో ఉన్నా ఉద్యోగాలు లభించనున్నాయి. 

డిజిటల్‌ చెల్లింపులు


ముట్టుకోకుండానే పనైపోవాలి అనుకుంటున్న ప్రజలు.. కరెన్సీ నోట్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. క్రెడిట్‌, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లింపులకూ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయకుండానే బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. పర్సులు, జేబులో కరెన్సీనోట్లు పెట్టుకుతిరిగేవారికి ఇకమీదట వ్యాలెట్‌ పేమెంట్లు, ఆన్‌లైన్‌ చెల్లింపులు ఒక్కటే మార్గం.

ఆహార అలవాట్లలో మార్పు

కొవిడ్‌ ప్రభావం భారత్‌లో తక్కువగా ఉన్నదంటే కారణం మనదేశ ఆహార అలవాట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సొంతింటి వంటతో ప్రయోజనాలను గుర్తించిన ప్రజలు ఇక జంక్‌ఫుడ్‌, ఆన్‌లైన్‌ ఫుడ్‌ఆర్డర్లకు దాదాపు స్వస్తి పలికినట్టే. వాటిస్థానంలో చిరు ధాన్యాలు, సేంద్రియ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోనున్నారు. దీంతోపాటు, వ్యక్తిగత వ్యాయామానికి కూడా ప్రాధాన్యమివ్వనున్నారు.

స్వదేశం నుంచే విదేశాల చదువు


కరోనా నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు వలస నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోవైపు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు విద్యా సంబంధ నిబంధనలను సడలిస్తున్నాయి. స్వదేశంలో ఉంటూనే ఆన్‌లైన్‌ ద్వారా చదువు పూర్తిచేసే అవకాశాన్ని రెండు రోజుల క్రితం కెనడా ప్రభుత్వం కల్పించింది. వర్క్‌ పర్మిట్‌ ఇచ్చేందుకు ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది. ఇదే దారిలో పలు దేశాలు ఆన్‌లైన్‌ కోర్సులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థులు విదేశాల్లో చదువు పూర్తిచేసే క్రమంలో ఎంతో ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చుల భారం మిగులనుంది. దీనికి తోడు స్వదేశంలో ఉంటూ ఇతర నైపుణ్యాలు పెంచుకోవటం, లేదా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే వీలు కలుగుతుంది. 


logo