సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 14:54:55

జీవితం, జీవనోపాధి ముఖ్యం : కేటీఆర్‌

జీవితం, జీవనోపాధి ముఖ్యం : కేటీఆర్‌

కరీంనగర్‌ : అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంచార వైద్యశాల ఏర్పాటు చేయగా.. మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా ప్రభావం పడని దేశం లేదన్నారు. ఇంకా ఎక్కువ కాలం లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని చెప్పారు. కరోనాతో సహ జీవనం చేస్తూనే ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.

అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ 72 ఏళ్ల పాటు స్వచ్ఛమైన తాగునీటికి మనం నోచుకోలేదని, సమీపంలోనే కృష్ణా, గోదావరి నదులున్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులుపడ్డామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఖర్చును విపక్షాలు తప్పుపడుతున్నాయని, డబ్బు గురించి ఆలోచించకుండా ప్రజలకు జరుగుతున్న మేలును చూడాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలనే ప్రభుత్వం అనుసరిస్తుందని ఈటల స్పష్టం చేశారు. కొత్త వైరస్‌ కావడంతో చికిత్స, పరీక్షల విషయంలో కొంత గందరగోళం ఉందని, వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo