మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 01:24:12

విషం పీడ విరగడ

విషం పీడ విరగడ

  • ఫ్లోరైడ్‌ నీటి నుంచి తెలంగాణకు విముక్తి
  • ఆరేండ్లుగా ఫ్లోరోసిస్‌ కొత్త కేసుల్లేవు
  • అధికారికంగా ప్రకటించిన కేంద్ర సర్కారు
  • ఐదేండ్లలో 967 గ్రామాలకు విముక్తి
  • మిషన్‌ భగీరథ ఫలితమన్న మంత్రి కేటీఆర్‌

విధి వెక్కిరిస్తే పుట్టుకతోనే వంకర్లుపోయిన దేహాలు! ప్రాణాలు నిలబెట్టాల్సిన నీళ్లే ఊపిరి తీస్తుంటే ఊళ్లొదిలిపోయిన జీవితాలు! బోసి నవ్వుల పసి వయసులోనే గార పట్టిపోయే పళ్లు! అస్తిపంజరాలను తలపించే శరీరాలు! నడివయసులోనే చేతికర్ర ఊతంగా  నడువాల్సిన బతుకులు! పట్టుకుంటే పగిలిపోయే ఎముకలు! ఏదోలా జీవితాన్ని ట్టుకొస్తున్నా.. చుట్టుముట్టి నరకప్రాయం చేస్తున్న కిడ్నీ సమస్యలు! పసిపాపను తలపించేలా ఉన్న యువకుడిని సాక్షాత్తూ ప్రధాని ముంగిట టేబుల్‌పై పడుకోబెట్టిన విషాద ఉదంతాలు! 

ఎగ్జిబిషన్లలో ప్రదర్శన సరుకులుగా మారిపోయిన జనాలు! అది ఫ్లోరైడ్‌ రక్కసి వికటాట్టహాసానికి బలైపోయిన తెలంగాణ పల్లెల కన్నీటి చిత్రం! ఇదీ తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉన్న దుస్థితి! ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా తమాషా చూసిన ఫ్లోరైడ్‌ రక్కసిని తెలంగాణ ఆరేండ్లలోనే తరిమేసింది! ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పసిద్ధితో మొదలైన మిషన్‌ భగీరథ.. ఫ్లోరైడ్‌పై సాధించిన విజయంతో మీసం మెలేస్తున్నది! తెలంగాణ వస్తే ఏమొస్తదన్న ప్రశ్నకు..ఇంతకు మించి జవాబేమున్నది! 

మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌

ఫ్లోరైడ్‌ పోరు యాత్రలో భాగంగా 2003లో మర్రిగూడకు వచ్చిన కేసీఆర్‌ అక్కడే ‘పల్లెనిద్ర’ చేశారు. బాధితుల వెతలు చూసి చలించిన ఆయన తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఇంటికీ నల్లాలతో రక్షిత తాగునీరు సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు. అధికారంలోకి  వచ్చిన తర్వాత  మాట నిలబెట్టుకున్నారు. 

  • 2014 డిసెంబర్‌ 9 చౌటుప్పల్‌లో మిషన్‌ భగీరథ పైలాన్‌ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 
  • 2017:  శరవేగంగా పనులు పూర్తి చేయించి, ఏడాది చివరి నుంచి   ఇంటింటికీ నల్లాతో తాగునీరు సరఫరా  చేయించారు.
  • ఫలితంగా నేడు సురక్షిత తాగునీటిని అందుకుంటున్న గ్రామాలు 1700

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: ఫ్లోరైడ్‌ రక్కసి బారినపడిన నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదు కాలేదని పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గడిచిన ఐదేండ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వేగంగా ఫ్లోరైడ్‌ సమస్యను పూర్తిగా అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ నిలువడం విశేషం. కేంద్రం విడుదలచేసిన జాబితాలో 2015లో తెలంగాణలో 967 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలు ఉండగా ఇప్పుడు అసలే లేవు. గుజరాత్‌లో 6, ఉత్తరఖండ్‌లో 2 గ్రామాలుండగా అవి సైతం ఫ్లోరైడ్‌ నీటి సమస్య నుంచి బయటపడ్డాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ 111 గ్రామాల్లో ఈ సమస్య ఉంది. అత్యధికంగా రాజస్థాన్‌లో 3,095, బీహార్‌లో 861, మధ్యప్రదేశ్‌లో 280, తమిళనాడులో 236, పంజాబ్‌లో 211, కర్ణాటక 177, పశ్చిమబెంగాల్‌లో 171, ఛత్తీస్‌గఢ్‌లో 154 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 

ఫ్లోరైడ్‌ గ్రామాలు సున్నా: మంత్రి కేటీఆర్‌

కేంద్రం విడుదల చేసిన ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల జాబితాపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘తెలంగాణ ఆవిర్భవానికి ముందు రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల సంఖ్య 967. మిషన్‌ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఆ సంఖ్య ఇప్పుడు సున్నాకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. మిషన్‌ భగీరథ టీంకు అభినందనలు’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రక్కసి బయటపడింది.. 1945లో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1937లో తొలిసారిగా ప్రకాశం జిల్లా దర్శిలో ఫ్లోరైడ్‌ను గుర్తించారు. తెలంగాణలో 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఉన్నదని నిజాం సర్కార్‌లో శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్‌ ఎంకే దాహూర్‌ వెల్లడించారు. ఆ ప్రాంతాలకు ఉపరితల నీటి వనరులతో తాగునీరు సరఫరా చేయాలని సిఫార్సు చేశారు. దీంతో నిజాం చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగెడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించారు. కానీ వర్షాభావం, కరువుతో మర్రిగూడ మండలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో తాత్కాలిక ఉపశమనాలే తప్ప ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. ఇక 1985లో బట్లపల్లిలో ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో (28 పీపీఎం) ఫ్లోరైడ్‌ ఉన్నట్టు తేలింది. ఈ ప్రభావంతో ఆ గ్రామ ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో బట్టుపల్లివాసులు చుట్టుపక్కల గ్రామాలైన ఈదులగూడెం, పాకలగూడెం, బట్లపల్లి (కొత్త), కంకణాలపల్లి, ఎల్లారెడ్డి గూడెం, ఎడవెల్లి గ్రామాలకు వలస వెళ్లారు.

శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

నల్లగొండ జిల్లాలో పండించే ఆహారంలోనూ ఫ్లోరైడ్‌ ఆనవాళ్లున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. దానికి కూడా శాశ్వత పరిష్కారం చూపుతూ సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకంలో పలు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. గొట్టిముక్కుల రిజర్వాయర్‌ పనులు 80% పూర్తికాగా శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పనులు 40% పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో సాగు నీరు అందితే భూగర్భ జలాలు పెరిగి.. ఫ్లోరోసిస్‌ భూతం నల్లగొండ నుంచి శాశ్వతంగా దూరం కానుంది. 

1600 కోట్లతో భగీరథ యత్నం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణలో 967 ఫ్లోరైడ్‌ ప్రభావిత ఆవాసాలున్నాయి. మిషన్‌ భగీరథలో భాగంగా రూ.1600 కోట్లు వెచ్చించి ఆ గ్రామాలన్నింటికి రక్షిత తాగునీటిని అందిస్తున్నారు. బట్లపల్లిలో రూ.440 కోట్లతో 90ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి ప్లాంటును నిర్మించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాంపల్లి, చందూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని ఫ్లోరైడ్‌ గ్రామాలకు ఇప్పుడు నల్లాలతో తాగునీరు సరఫరా అవుతున్నది. ఒక మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోనే సుమారు లక్షన్నర మందికి శుద్ధిచేసిన తాగునీరు అందుతున్నది. 2005 నుంచే ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు కృష్ణా నది జలాలను సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు కావాలంటే ట్యాంకుల వరకు పోవాల్సి రావడంతో వినియోగం అంతంత మాత్రమే ఉండేది. ఇప్పుడు నల్లాల ద్వారా ఇంటింటికీ నీరు సరఫరా చేస్తుండటంతో వినియోగం పెరిగింది.ఆరేండ్ల్లుగా కొత్త కేసు నమోదు కాలేదు

2014 నుంచి జిల్లాలో కొత్తగా ఫ్లోరోసిస్‌ కేసు నమోదు కాలేదు. ప్రతి ఏడాది ఫ్లోరైడ్‌ ప్రభావం ఉన్న మండలాల్లోని స్కూల్‌ విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నం. స్కూళ్లకు పోయి విద్యార్థుల మూత్రం సేకరించి..  పరీక్షలు చేస్తున్నాం. 2014లో 413మందికి 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఫ్లోరిన్‌ శాతం ఉన్నది. 2019లో 94 మందికే ఉన్నది. ప్రతీ సంవత్సరం ఈ సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తున్నది.  సురక్షితమైన మంచినీళ్లు తాగడం వల్లనే ఫ్లోరైడ్‌ వస్తలేదని తెలుస్తున్నది. గతంలో పిల్లల పళ్లపైనా గారలు కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి లక్షణాలు కనిపించలేదు.

- డాక్టర్‌ కొండల్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో, నల్లగొండ

మిషన్‌ భగీరథతోనే ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి

మిషన్‌ భగీరథ నీటితో చిన్నారుల్లో ఫ్లోరోసిస్‌ సమస్య కొత్తగా ఎక్కడా కనిపించడం లేదు. ఫ్లోరోసిస్‌ బాధితుల తరపున సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు.   ఇంకా ఇక్కడి ఆహారంలోనూ ఫ్లోరైడ్‌ ఆనవాళ్లున్నాయి. దాని నుంచి శాశ్వత పరిష్కారం లభించాలంటే సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తికావాలి. ఇదే జరిగితే ప్రతి ఫ్లోరోసిస్‌ ప్రతి బాధితుడి ఇంట్లో కేసీఆర్‌ ఫొటో పెట్టుకొని పూజిస్తారు. 

- కంచుకట్ల సుభాష్‌, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కన్వీనర్‌

నా ఇంటికే నల్లా నీళ్లు వస్తున్నాయి

ప్లోరైడ్‌ నీళ్లు తాగ డం వల్ల గతంలో కాళ్ల నొప్పులు వస్తుండె. కేసీఆర్‌ సార్‌ ఇస్తున్న నీళ్లు మా ఇంట్లకే వస్తున్నయ్‌. ఆ నీళ్ల్లు తాగుతున్నంక కాళ్ల నొప్పు లు పోయినయ్‌. నాకు పెండ్లయ్యి ఈ ఊరికి వచ్చినప్పుడు నా కంటే చిన్నోల్లు కూడా ముసలోల్ల లాగా అగుపించేది.  ఇప్పుడు మాకు కాళ్ల నొప్పులు లేవు. కేసీఆర్‌ సారుకు దండాలు.

- పొలగోని సాయిలమ్మ, దామోర, నాంపల్లి మండలం

తాగునీటి  సరఫరాలో దేశానికే ఆదర్శం 

తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పట్టాణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు దక్కుతుంది. మిషన్‌ భగీరథ పథకంతో రాష్ట్ర ప్రజలకు ఫ్లోరైడ్‌ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించారు. స్వచ్ఛమైన గోదావరి, కృష్ణ, సింగూరు జలాలను ఇంటింటికి నల్లాద్వారా సరఫరాచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 

- మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు 

నాడు :  బల్లపరుపు బతుకులు..

2003, మార్చి 12న పార్లమెంట్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజపేయి చాంబర్‌లో నల్లగొండ జిల్లా కోదండపురం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్‌ బాధితులు కొత్తపల్లి నర్సింహ, అంశుల స్వామిని టేబుల్‌పైన ఉంచి సమస్యలను వివరిస్తున్న జలసాధన సమితి అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణనేడు:  నిట్ట నిటారు గెలుపులు..

మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో మిషన్‌ భగీరథ నల్లా నీటిని తన ఇంట్లోనే పట్టుకుంటున్న మహిళ
logo