గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 16:12:25

హరితహారాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖలు

హరితహారాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖలు

హైద‌రాబాద్ : ఈ నెల 25 న ప్రారంభం కానున్న ఆరో విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్యక్రమంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో  దీన్ని విజయవంతం చేయాలని  స‌హ‌చ‌ర ‌మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఆయన ఈ విషయమై ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన  అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేయడం మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన యజ్ఞంలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.

 రాష్ట్రంలో 24 శాతమున్న అటవీ శాతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో  ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా  230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 182 కోట్ల మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు. హరితహారంతో పల్లెలు పచ్చబడి, పారిశుద్ధ్యం మోరుగైందన్నారు.ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుడతారు. ఆరో విడ‌త హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ శాసన సభ్యులు  మీ నియోజ‌క‌వ‌ర్గ‌ పరిధిలో  పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. నాటిన మొక్కలు సంర‌క్షించేలా చూడాల‌ని మంత్రి కోరారు.


logo