మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Feb 07, 2020 , 01:58:24

కందుల కొనుగోలు కోటా పెంచండి

కందుల కొనుగోలు కోటా పెంచండి
  • మరో 56 వేల మెట్రిక్‌ టన్నులు తీసుకోండి
  • కేంద్రానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కందుల కొనుగోలు కోటాను మరో 56 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర వ్యవసాయశాఖకు లేఖ రాశారు. రాష్ట్రంలో వానకాలంలో దాదాపు 2.7 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం నాఫెడ్‌ ద్వారా 47,500 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ఇచ్చిన అనుమతి ఏ మాత్రం సరిపోదని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇచ్చిన కొనుగోలు అనుమతికి మరో 56 వేల మెట్రిక్‌ టన్నులకు అవకాశం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. 


సహకార ఎన్నికల తర్వాత డీసీసీబీ ఎన్నికలు 

సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కో-ఆపరేటివ్‌ అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సహకార ఎన్నికల అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని చెప్పారు. గురువారం వ్యవసాయ, మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌శాఖ కార్యదర్శి, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో కలిసి సహకార ఎన్నికలు, మార్కెటింగ్‌, ఉద్యానశాఖలపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. 


యాసంగిలో యూరియా సరఫరాలో జాప్యం ఉండొద్దని, ఫిబ్రవరిలో రావాల్సిన 2 లక్షల టన్నులను సకాలంలో తీసుకోవాలని మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. ప్రతివారం ఎరువుల కంపెనీలతో సమీక్షలు నిర్వహించాలన్నారు. కోహెడ మార్కెట్‌ను పరిశీలించి అభివృద్ధికి తగినచర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సమీక్షలో ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల, ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, సహకారశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుమిత్ర పాల్గొన్నారు.