గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 19:45:43

సమిష్టిగా కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి

సమిష్టిగా కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి

జ‌న‌గామ  : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, క‌రోనా విస్తరణ ఆగ‌డంలేదు. ఒక‌వైపు ప్రభుత్వం మ‌రో వైపు సీఎం కేసీఆర్, అటు అధికారులు, డాక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులు అంతా క‌లిసి క‌ట్టుగా ప్రయత్నిస్తున్న వైరస్ పెరుగుతూనే ఉంది. అయినా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరోనాని కట్టడి చేద్దామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల‌ను కూడా ఆప‌కుండా వేగిరం చేద్దామ‌ని మంత్రి అన్నారు.  పాల‌కుర్తి నియోజ‌‌క‌వ‌ర్గంలో క‌రోనా ప‌రిస్థితులు, అభివృద్ధి ప‌నుల‌పై ప్రజాప్రతినిధులు, మండ‌ల పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాల‌కుర్తి మంత్రి క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, క‌రోనా వ్యాప్తికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మిగ‌తా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల కంటే ముందే మేలుకొందన్నారు. అనేక చర్యలు చేపట్టి లాక్ డౌన్ విధించిందన్నారు. ఆర్థిక భారాల‌ను సైతం ఓర్చి, అభివృద్ధి ప‌నుల‌ను ఆప‌లేదన్నారు. క‌రోనా వైర‌స్ మ‌రింత‌గా విస్తరించకుండా సమన్వయంతో మెల‌గాలి. గ్రామ స్థాయిల్లో క‌మిటీలు వేద్దాం.

స‌ర్పంచ్, ఎంపీటీసీ, రైతు సమన్వయ స‌మితి గ్రామ సమన్వయకర్త‌, గ్రామాల పార్టీల ప్రతినిధులు, యూత్ తో క‌లిపి క‌మిటీలు వేయాలన్నారు. ఆ క‌మిటీలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో క‌రోనా ప‌రిస్థితుల మీద నిఘా పెట్టి ఆరా తీస్తూ, వైర‌స్ విస్తరణను కట్టడి చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించి భ‌రోసానివ్వాలన్నారు. అలాగే మాస్కులు ధ‌రించ‌ని వాళ్లకు భారీగా జ‌రిమానా విధించాల‌ని మంత్రి సూచించారు. అన్ని ర‌కాల ఫంక్షన్లను ర‌ద్దు చేయాలన్నారు.

ఎర్రబెల్లి ట్రస్టు త‌ర‌ఫున నియోజ‌క‌వ‌ర్గంలో రెండు అంబులెన్సులు త్వరలోనే పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి  అందజేస్తానని మంత్రి ప్రకటించారు. కరోనా సోకిన వారితో మాన‌వత్వంతో మెల‌గాల‌ని, ఇలాంటి క‌ష్ట కాలంలో ప్రజలకు అండ‌గా నిల‌వాల‌ని మంత్రి  పిలుపునిచ్చారు. సమీక్షలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo