గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 19:13:49

'హైదరాబాద్‌ అభివృద్ధిని నిలబెడదాం.. కేసీఆర్‌కు అండగా నిలుద్దాం'

'హైదరాబాద్‌ అభివృద్ధిని నిలబెడదాం.. కేసీఆర్‌కు అండగా నిలుద్దాం'

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ అభివృద్ధిని నిలబెడదాం.. సీఎం కేసీఆర్‌కు అండగా నిలుద్దామని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. నేటి దీక్షా దివస్‌ను పురస్కరించుకుని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణతో ఇతర అధికారులు అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. అనంతరం స్పందిస్తూ.. సామాజిక బాధ్యతతో తమను కని ఎదుగుదలకు తోడ్పడిన తెలంగాణ కోసం భూమి పుత్రులుగా గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యావంతులు రాష్ట్ర సాధన కోసం ఐక్యంగా కృషిచేశారన్నారు. 

స్వరాష్ట్రంలో ఉద్యమనాటి ఆకాంక్షలను, అవసరాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాంతికాముక, సహజీవన, సంతోష సూచికల్లో దేశంలోనే తెలంగాణ, దక్షిణ భారత గుండెకాయ హైదరాబాద్‌ చిరునామాగా మారిందన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. కావునా సీఎం కేసీఆర్‌కు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. 

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్‌. భిన్న సంస్కృతులకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆ ఘన వారసత్వం కొనసాగిస్తూ అభివృద్ధి, సహజీవన సౌందర్యంతో అందరికి నీడనిచ్చి అన్నంపెట్టి ఆదుకునే అమ్మలా హైదరాబాను నిలిచేలా చేస్తున్న ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు మరింత ఊతమయ్యేలా అందరూ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్‌ రవీందర్‌ కుమార్‌, ఎస్‌.సహదేవ్బి, వెంకటయ్య, మదుసూదన్‌ గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణ యాదవ్‌, నగరశాఖ అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు, హరికృష్ణ, ప్రణయ్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, శ్రీనిష్‌, మోహనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


logo