బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:08:40

చేసిందే చెప్పి ఓట్లు అడుగుదాం

చేసిందే చెప్పి ఓట్లు అడుగుదాం

వారం రోజులు కష్టపడితే విజయం మనదే.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

పటాన్‌చెరు: అభివృద్ధి పనులే విజయానికి తారకమంత్రమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పటాన్‌చెరులోని జీహెచ్‌ఎంసీ 113వ డివిజన్‌లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూత్‌ స్థాయిలో కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగాలని సూచించారు. చేసిన పనులే మనకు విజయాన్ని అందజేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సమష్ఠిగా కృషి చేస్తే మూడు డివిజన్లను తప్పక గెలుస్తామన్నారు. వారం రోజులు కష్టపడితే గొప్పవిజయాన్ని సీఎం కేసీఆర్‌కు కానుకగా అందజేయగలమన్నారు. 

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు..

పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ నాయకుడు సాయిముదిరాజ్‌ ఆధ్వర్యంలో వందమంది, బండ్లగూడ కాంగ్రెస్‌ నాయకుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 70 మంది, పట్టణ మైనార్టీ కాంగ్రెస్‌ నాయకుడు ఆసిఫ్‌ ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కే సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు.