శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 12:21:13

అమరుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అమరుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ :  అడ‌వుల సంర‌క్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడు గుర్తుంటాయని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన వీరులకు మంత్రి అంజలి ఘటించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రకృతి వనరులను కాపాడ‌టంతో పాటు వ‌న్యప్రాణుల‌ సంరక్షణకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో ‌శ్రమిస్తున్నారన్నారు. క‌రోనా మ‌హమ్మారి అంద‌రినీ బ‌య‌పెట్టినా  అట‌వీ శాఖ అధికారులు, సిబ్బంది ధైర్యంగా నిల‌బ‌డి విధి నిర్వహణలో కొన‌సాగించ‌డం అభినంద‌నీయమన్నారు. విధి నిర్వహణలో క‌రోనా బారిన‌ప‌డి  కొంత‌మంది అధికారులు చ‌నిపోవ‌డం విచారకరమన్నారు. 


అట‌వీ సంప‌ద‌ను కాపాడాల‌నే ల‌క్ష్యంతో నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేశామని పేర్కొన్నారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో ఇప్పటి వ‌ర‌కు  పీడీ యాక్టు కింద 5 కేసులు న‌మోదు చేశారన్నారు. అటవీ శాఖ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని,  ఆత్మరక్షణతోపాటు అటవీ సంపదను కాపాడాలని కోరారు. 

కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, ఆర్. హేమంత్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ (సౌత్ జోన్, చెన్నై) పీసీసీఎఫ్ లు డొబ్రియల్, లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, పర్గెన్,  జూ పార్క్ డైరెక్టర్ కుక్రేటి, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, 2018 బ్యాచ్ కు చెందిన  నలుగురు ఐఎఫ్ఎస్ ట్రైనీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo