ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 15:13:20

పర్వతగిరి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : పర్వతగిరి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పర్వతగిరి మండలానికి మంజూరైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం పనులపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం పైలట్ ప్రాజెక్ట్ గా పర్వతగిరి మండలాన్ని తీసుకున్నాం. 

పర్వతగిరి మండలాన్ని ఈ పథకం కింద అన్ని విధాల అభివృద్ది చెందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరైన రూ.30కోట్లతో  అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కుటీర పరిశ్రమల ద్వారా, కుల వృత్తుల ద్వారా అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


వైద్య సేవలు ప్రతి ఒక్కరికి ఈ మిషన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గుర్తించిన పనులకు అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలి. మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, పనుల సమన్వయాన్ని కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo