ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:22

ప్లాస్టిక్‌ బ్రిక్స్‌తో ఇల్లు కట్టేద్దాం!

ప్లాస్టిక్‌ బ్రిక్స్‌తో ఇల్లు కట్టేద్దాం!

  • ఎక్కువ కాలం మన్నిక నిర్మాణం చకచకా
  • టైల్స్‌నూ సిద్ధంచేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీ
  • ప్లాస్టిక్‌ భూతానికి చెక్‌.. ఆదాయానికి ఆదాయం

ప్లాస్టిక్‌ ఇటుకలతో ఇల్లు కట్టేద్దామా..? ఫ్లోరింగ్‌కూ ప్లాస్టిక్‌ టైల్స్‌ వేద్దామా..? ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్‌ ఇటుకలు, టైల్స్‌ తయారవుతున్నాయి. అక్కడి మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులకు వచ్చిన వినూత్న ఆలోచన ఇది. వాటితో ఇండ్లు నిర్మించుకోవచ్చు.. టైల్స్‌తో ఫ్లోరింగ్‌ వేసుకోవచ్చు. ఇండ్ల నుంచి సేకరించిన చెత్తలో దాదాపు 45% ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. వీటిని రీసైక్లింగ్‌ చేసి టైల్స్‌, బ్రిక్స్‌ తయారుచేస్తున్నారు.  

సూర్యాపేట, జనవరి 8(నమస్తే తెలంగాణ): వందల ఏండ్లు గడిచినా మట్టిలో కలిసిపోని ప్లాస్టిక్‌ భూతానికి చెక్‌ పెడుతున్నది సూర్యాపేట మున్సిపాలిటీ. వాడి పడేసిన ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులను ఎలాం టి రసాయనాలు కలుపకుండా రీసైక్లింగ్‌ చేస్తున్నది. ముద్దలుగా తయారైన ప్లాస్టిక్‌ నుంచి ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ తయారు చేస్తున్నది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ను రీసైకిల్‌ ద్వారా ముద్దలు తయారు చేసి హెచ్‌డీపీఈ పైపుల ఫ్యాక్టరీకి విక్రయిస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేటలోనూ అదే మాదిరిగా నెల రోజుల క్రితం ప్రారంభించగా దాదాపు రూ.65 వేల ఆదాయం వచ్చింది. అనంతరం ప్రత్యేకంగా ఇనుప ఫ్రేమ్‌ల తో ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రీసైక్లింగ్‌  కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు రూ.20 లక్షలు వెచ్చించి ప్లాస్టిక్‌ వస్తువుల క్లీనింగ్‌, వేడి వేసి ప్లాస్టిక్‌ను తయారు చేసే యంత్రాలను కొనుగోలు చేశారు. ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న చెత్తలో వచ్చిన ప్లాస్టిక్‌ను వేరు చేసి ముద్దలుగా తయారు చేసి హెచ్‌డీపీఈ పైపుల కంపెనీకి ముడిసరుకుగా విక్రయించారు. అంతటితో ఆగకుండా ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ చేయాలనే ఆలోచన మేరకు సొంతంగా ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ మోడల్‌లో ఇనుప ఫ్రేమ్‌లు తయారు చేయించారు. రీసైక్లింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే ప్లాస్టిక్‌ను ఫ్రేమ్‌లలో వేసి ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ తయారుచేశారు. ప్లాస్టిక్‌ రోడ్డు నిర్మాణం, డివైడర్లకు వినియోగించేందుకు అసలు అవి ఎంత వేడిమిని తట్టుకుంటాయి?, ఎంత కాలం ఉపయోగించుకోవచ్చనే? విషయం తేల్చేందుకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ల్యాబ్‌కు పంపించారు. 

వేస్టేజీతో టైల్స్‌ తయారీ

ప్లాస్టిక్‌ వేస్టేజీతో ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ తయారు చేస్తున్నాం. రూ.20లక్షలు వెచ్చించి మిషనరీ కొనుగోలు చేసి ఒక ఆపరేటర్‌ను నియమించాం. సూర్యాపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి వినియోగించిన ప్లాస్టిక్‌ కవర్లు తెప్పిస్తున్నాం. ఈ ప్లాస్టిక్‌తో గార్డెన్లలో అలంకరణలు, చెట్ల చుట్టూ డిజైన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే పార్కుల్లో మెట్లలా వాడుకునే అవకాశం ఉంది. 

- రామానుజులరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట 

ప్రజలు సహకరించాలి 

పర్యావరణానికి పెను ముప్పుగా వాటిళ్లుతున్న ప్లాస్టిక్‌కు సూర్యాపేటలో ఓ పరిష్కారం లభించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు ఇక్కడ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక మీదట ప్రజలు వినియోగించే ప్రతి ప్లాస్టిక్‌ కవరును బయట పడేయకుండా ఇంటింటికి వచ్చే మున్సిపల్‌ సిబ్బందికి అందిస్తే వాటిని రీసైక్లింగ్‌ ద్వారా ఇటుకలు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ తయారు చేయిస్తాం.

- పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, సూర్యాపేట


logo