శనివారం 06 జూన్ 2020
Telangana - May 11, 2020 , 00:50:43

బాధ్యతగా మెలుగుదాం

బాధ్యతగా మెలుగుదాం

 • లాక్‌డౌన్‌లో ఇంట్లోనే భద్రంగా ఉన్నాం 
 • సడలింపులతో ఆదమరిస్తే కరోనా కాటేస్తుంది
 • వైరస్‌ సోకకుండా అప్రమత్తంగా ఉందాం 
 • గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నియంత్రణకు 48 రోజులుగా లాక్‌డౌన్‌తో ఇంట్లోనే బంధీ అయిన మనిషి.. మళ్లీ బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రకరకాల సేవలు అందుబాటులోకి వస్తుండటంతో జనం ఉత్సాహంగా రోడ్లెక్కుతున్నారు. మరోవైపు కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు కరోనాను తప్పించుకు తిరుగువారే ధన్యులని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ బారిన పడకుండా స్వీయ నియంత్రణతోపాటు ఇతరుల పట్ల, పరిసరాల పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహనతో మెలగాలని పేర్కొంటున్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్య జీవితంలో పాటించాల్సిన నియమాలను కరోనా చికిత్స పద్ధతుల కోఆర్డినేటర్‌, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.

వైరస్‌ ఇప్పుడే అంతమయ్యేలా లేదు

కరోనా వైరస్‌ ఇప్పుడే అంతమయ్యేలా లేదు. ఇది గతంలో వచ్చిన హెచ్‌1, ఎన్‌1 (స్వైన్‌ ఫ్లూ) మాదిరిగా ఇంకా కొంతకాలం మన మధ్యే  ఉండిపోయే అవకాశమున్నది. వచ్చేది వానకాలం, చలి కాలంలో వైరస్‌ మరోసారి విజృంభించి పీక్‌ స్టేజ్‌కి చేరే ప్రమాదం కూడా ఉన్నది. ఆ తర్వాత మళ్లీ తగ్గుముఖం పడుతుంది. ఇలా కొన్ని పర్యాయాలు జరుగుతుంది. వైరస్‌లో దశలు మారవచ్చు. దశలు మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. వ్యాక్సిన్‌ వచ్చేవరకు వైరస్‌ మనలో ఎవరిలోనైనా ఉంటుందన్న విషయాన్ని మరువద్దు. అలాంటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదు. భౌతిక దూరం ఒక్కటే సరిపోదు. ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో చాలా భద్రంగా ఉన్నాం. లాక్‌డౌన్‌ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ప్రజలు కనీసం నియమాలు పాటించాలి. తెలంగాణలో ప్రైమరీ కేసులే అధికంగా ఉన్నాయి. సెకండరీ కేసులు చాలా తక్కువ. సామాజిక వ్యాప్తి లేదు. ప్రజలు లాక్‌డౌన్‌ను సక్రమంగా పాటించడం వల్లే ఇది సాధ్యమైంది. రానున్న రోజుల్లో కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తే వారితోపాటు కుటుంబానికి, సమాజానికి శ్రేయస్కరం. ఆదమరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

రాజారావు సూచించిన జాగ్రత్తలు

 • రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
 • మూడడుగుల మేర భౌతికదూరం పాటించాలి.
 • మాస్క్‌ ధరించడం మరవకూడదు.
 • నమస్కారం శ్రేయస్కరం.
 • గుంపులుగుంపులుగా ఉండకూడదు.
 • ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేసిన వెంటనే చేతులకు శానిటైజ్‌ చేసుకోవాలి. 
 • దూర ప్రయాణాలు మానుకోవాలి- అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దు
 • బయటి ఆహారం తీసుకోకూడదు.
 • పెండ్లిల్లు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి- రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు. 
 • తప్పనిసరైతే పరిమిత సంఖ్యతో శుభకార్యాలు నిర్వహించాలి.
 • జాతర్లు, వేడుకలు నిర్వహించకూడదు. ఎక్కడైనా జరిగినా వాటికి వెళ్లకపోవడం ఉత్తమం.
 • సరాదాకైనా, వేడుకలలోనైనా కేకులు కట్‌చేసి తినడం, చేతుల ద్వారా పరస్పరం స్వీట్లు పంచడం చేయకూడదు.
 • ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో ప్రయాణించే సమయంలో పక్కపక్కన కూర్చోకూడదు. భౌతికదూరం పాటించాలి.
 • సాధ్యమైనంత వరకు షాపింగ్‌కు దూరంగా ఉండాలి.
 • దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు హోం క్వారంటైన్‌ పాటించాలి.
 • శాఖాహారం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ఉత్తమం.


logo