మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 12:42:38

చెట్లను కాపాడుకుందాం.. లేదంటే గాలిని కొనుక్కోవాల్సిందే: కేటీఆర్‌

చెట్లను కాపాడుకుందాం.. లేదంటే గాలిని కొనుక్కోవాల్సిందే: కేటీఆర్‌

కరీంనగర్‌: చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.  ప్రతి ఒక్కరు హరిహారం కార్యక్రమంలో పాల్గొన్నాలని కోరారు. హరితహారంతో రాజకీయంగా లాభం ఉండదని, ముందు తరాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. హరితహారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామ శివారులో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. 

రాష్ట్రంలో అడవులను 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. 10 శాతం బడ్జెట్‌ను హరితహారం కార్యక్రమానికి కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఇప్పటివరకు 180 కోట్లకుపైగా మొక్కలు నాటామన్నారు. ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వెల్లడించారు. గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్‌ పదవి పోయేలా పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చామన్నారు. అన్ని రకాల రోడ్లుకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. కరోనా సంక్షోభంలో కూడా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని, రాబోయే నాలుగేళ్లు పూర్తిస్థాయిలో అభివృద్ధిపైనే దృష్టిసారిస్తామని వెల్లడించారు. ప్రతినెల గ్రామ పంచాయతీల అభివృద్ధికోసం రూ.338 కోట్లు కేటాయించామన్నారు. ఇంటింటికి నీరిచ్చే మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో మోతె ప్రాంతానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 


logo