గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 01:53:58

రజకులకు చేయూతనివ్వాలి

రజకులకు చేయూతనివ్వాలి

  • గంగులకు రజక సంఘాల వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రజకులు తమ వృత్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్థికపరంగా చేయూత అందించాలని తెలంగాణ రజక సంఘాల సమితి ప్రతినిధులు కోరారు. వారు సోమవారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మంత్రుల నివాస ప్రాంగణంలో కలిశారు. ప్రభుత్వ దవాఖానలు, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, దేవాలయాల్లో బట్టలుతికే పని కాంట్రాక్టర్లకు కాకుండా రజకులకే అప్పగించాలని కోరారు. రజక వృత్తిలో కొనసాగిన వారికి 50 ఏండ్ల వయసులోనే ఆసరా పథకం కింద పింఛన్లు ఇప్పించాలని విన్నవించారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తమ సమస్యలు గుర్తించి పలు కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రజకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి మూడెకరాల స్థలం, రూ.5కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వరంగల్‌లో రజక భవన నిర్మాణానికి రూ.1.90లక్షలు, నల్లగొండ జిల్లా కేంద్రంలో రజక భవన నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. మంత్రి గంగులను కలిసినవారిలో సమితి రాష్ట్ర చైర్మన్‌ అక్కరాజు శ్రీనివాస్‌, కన్వీనర్‌ మానస గణేశ్‌, ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పెద్దాపురం కుమారస్వామి, కో కన్వీనర్లు చంద్రమౌళి, కోట్ల శ్రీనివాస్‌, ఎల్లంగారి పురుషోత్తం తదితరులున్నారు.


logo