సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:38

రెవెన్యూ వాళ్లు శత్రువులు కాదు..

రెవెన్యూ వాళ్లు శత్రువులు కాదు..

  • ఏజెన్సీలోని గిరిజనేతరులకు రైతుబంధుపై ఆలోచిస్తాం
  • వ్యవసాయేతర భూములకు మెరూన్‌ పాస్‌బుక్కులు.. 
  • రైతులకు ప్రభుత్వంపై విశ్వాసానికి ప్రతీక నియంత్రితసాగు.. 
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  రెవెన్యూ సిబ్బంది తమకేమీ శత్రువులు కారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొందరు తప్పులు చేసినంత మాత్రాన రెవెన్యూ విభాగం ఉద్యోగుల కృషిని విస్మరించలేమని స్పష్టంచేశారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌.. అద్భుతంగా పనిచేసే శాఖ అని ప్రశంసించారు. శుక్రవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ పలు అంశాలపై సీఎం స్పష్టతనిచ్చారు.   ఏ అధికారి తప్పు చేసినా, తొలగిస్తామని స్పష్టంగా చట్టంలో పెట్టాము. కొత్త చట్టం ద్వారా ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంకా తప్పులు జరుగుతాయని అనుకోవటంలేదు. అక్షాంశాలు, రేఖాంశాలతో కోఆర్డినేట్స్‌ ఇచ్చిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకటి విచక్షణాధికారాలు పోయినవి. రెండోది ఏమీ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే ఇతరత్రా పవర్స్‌ వారికి ఉంటాయి. రెవెన్యూవాళ్లు శత్రువులు కాదు.. వాళ్లూ మనవాళ్లే. కొందరు తప్పులు చేసింది నిజమే. అలాఅని రెవెన్యూ విభాగం ఉద్యోగుల కృషిని విస్మరించలేము. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ హైలీ పర్ఫార్మెన్స్‌ శాఖ. సందర్భానుసారంగా చాలా పనులుచేస్తారు. విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లో నిద్రాహారాలు మానేసి పనిచేస్తారు. వారికి 54 రకాల విధులు ఉన్నాయి. వేరేవాళ్లు చేయలేరు. ఒక్క వీఆర్వో తప్ప అందరూ ఉంటారు. మొత్తం రెవెన్యూ చెడిపోయిందని చెప్పలేం. కొందరు తప్పు చేయొచ్చు. ఎక్కువ బాధలు పెట్టింది వీఆర్వోలు అని సమాజం నుంచి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థను నిర్మూలించాం. ఇలాచేయడం మొదటిసారి కాదు. మరొక్క ముఖ్యవిషయం ఏమిటంటే.. భూమిశిస్తు వసూలు చేసేది ఉంటేనే గ్రామంలో రెవెన్యూ అధికారి అవసరం. లేదంటే అవసరంలేదు. చట్టం అమల్లోకి వచ్చాక ప్రజలు సంతోషిస్తారు. 

విజయవంతంగా నియంత్రిత సాగు

రైతులకు లాభం జరగాలి. ఇబ్బడిముబ్బడిగా ఒకే రకం పంటలు వేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ధరలు రావటం లేదు. ఇప్పుడు మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి చేస్తున్నది. మరోవైపు మక్కకు ధర రావటం లేదు. అందుకే మక్కలు వేయొద్దు అని చెప్పాం. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మక్కలు వస్తున్నాయి. మనం పండిస్తే ఎవరు కొనుగోలుచేయాలి? మార్కెట్‌లో తక్కువ ధరకు దొరుకుతుంటే రూ.1800 ధర అంటే ఎవరు కొంటారు? కాబట్టి ఒక శాస్త్రీయ విధానం తీసుకువచ్చి, రైతులకు లాభం చేకూర్చే పనిచేయాలని నిర్ణయించాం. నియంత్రిత సాగు తీసుకువచ్చాం. ఏ సమయానికి ఏ పంటలు వేస్తే బాగుంటదనేది ఎంతో ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా గొప్ప విజయం సాధించింది. నేనూ ఆశ్చర్యపోయాను. మన దగ్గర 12 లక్షల ఎకరాలు మక్కజొన్న వేసేది. కంది పంట 40, 50వేల ఎకరాల కంటే ఎక్కువ వేయకపోయేది. నియంత్రితసాగు వైపు వెళ్లండని చెప్తే ప్రభుత్వాన్ని రైతులు విశ్వసించారు. అందుకే కేవలం లక్ష ఎకరాల్లోనే మక్కజొన్న వేశారు. అది కూడా డెయిరీ, ఇతర అవసరాలకోసం అని చెప్పారు. మొత్తం పదిన్నర లక్షల ఎకరాల్లో కంది సాగైంది. మక్క స్థానంలో కంది వచ్చి, కంది స్థానంలో మక్క వచ్చింది. నియంత్రితసాగును కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ఏ పంటలు వేసినా ఇవ్వాలనే డిమాండ్‌తో ఎమ్మార్వో ఆఫీసులకు పోయి దరఖాస్తులు పెట్టించారు.

వ్యవసాయేతర భూములకు మెరూన్‌ కలర్‌ పాస్‌పుస్తకాలు

వ్యవసాయేతర భూముల విషయంలో పూర్తి స్పష్టత తీసుకువస్తాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, శాశ్వత పరిష్కారం చూపేలా మెరూన్‌ కలర్‌ పాస్‌పుస్తకాలను జారీచేస్తాము. వ్యవసాయేతర భూములు ఎప్పటికి వ్యవసాయ భూములు కావు. ఈ తరహా భూములకు పాస్‌పుస్తకాలు ఇచ్చి హక్కులు కల్పిస్తాం. వ్యవసాయభూమికి గ్రీన్‌, వ్యవసాయేతర భూమికి మెరూన్‌ కలర్‌ పాసుబుక్‌ ద్వారా హక్కులు కల్పిస్తాం.. బంజారాహిల్స్‌లో ఉన్న నా ఇంటికి కూడా మెరూన్‌ పాస్‌పుస్తకం వస్తుంది. ఇండ్లకు, ప్లాట్‌కు, ఫ్లాట్‌కు, కంపెనీకి, రైస్‌ మిల్లులకు ఇలా.. దేనికైనా ఇస్తాం. ఇక మీదట కబ్జాలు, గూండాగిరీకి ఆస్కారముండదు. ముఠాలు, మాఫియా నుంచి ప్రజలకు రక్షణ దొరుకుతుంది.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకు రైతుబంధు

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎప్పుడో వచ్చారు.. ఉంటున్నారు. వాళ్లకు రైతుబంధు రావటంలేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నా దృష్టికి తీసుకువచ్చారు. ఇవ్వాలని అడుగుతున్నారు. ఇప్పటివరకు అందరికీ రైతుబంధు ఇస్తున్నాం. ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. ఈ రైతులకు ఎలా రైతుబంధు ఇవ్వడం సాధ్యమవుతుందనేది చూస్తాం. ఇంతమందికి ఇచ్చి వాళ్లకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు కూడా రైతుబంధు ఇచ్చే అంశం పరిశీలిస్తం.

 ప్రతి ఒక్కరికీ రైతుబంధు

రైతుబంధు విషయంలో చివరితేదీ వరకు వెతికివెతికి ఇచ్చాము. ఇటీవల రైతుబంధు ఇచ్చినప్పుడు ఈ దిశగానే పరిశీలించిన. ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు అందేలా చూడాలని వ్యవసాయమంత్రికి చెప్పిన. వానకాలంలో 1,45,58,000 ఎకరాలకు రైతుబంధు ఇచ్చినం. 57,90,000 మంది రైతులకు రూ.7,279 కోట్లు 48 గంటల్లో చేరినయి. ఇలాచేరిన దీనిపై ఇంటెలిజెన్స్‌తోపాటు ఇతర రకాల్లో నిఘా పెట్టమని చెప్పిన. గ్రామాల్లో రైతుబంధు వచ్చినవాళ్లు, రానివాళ్ల వివరాలను తీసుకోమన్నం. అక్రమమా, సక్రమమా తెలుసుకున్నం. ప్రభుత్వ డబ్బు కొంత ఎక్కువ పోయిందిగానీ.. నాకు రాలేదని చెప్పినవారు మాత్రం ఎవరూ లేరు. ఒకరి డబ్బులు ఇంకొకరికి వచ్చినయన్న వాళ్లు లేరు. అందరు ఆనందంగా ఉన్నరు. వీటికి దస్కత్‌లేదు, రసీదు లేదు, మసీదు లేదు. లంచం లేదు. అయ్యలేడు, అవ్వలేదు. నేరుగా రైతుల అకౌంట్లకు చేరినయి. దీన్ని బట్టి వివాదాలు తక్కువగా ఉన్నదనే కదా అర్థం. కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క మాత్రం రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందని వారి జిల్లాల్లో ఏదోచేసినట్లు చెప్తున్నారు. అన్యాయంగా మాట్లాడుతున్నారు. అవి బీడుభూములు కాదు.. వంద శాతం వ్యవసాయేతర భూములు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 21,967 ఎకరాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక క్యాటగిరీలో ఎంట్రీ చేశారు. రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందని ఇలా ఎంట్రీ చేశామని భట్టి వ్యాఖ్యానించడం దారుణం. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. 

కేసీఆర్‌ మా కల నెరవేర్చారు

తరతరాలుగా నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్న మాకు వీఆర్‌ఏలుగా గుర్తింపునిచ్చి, రూ.10వేల గౌరవ వేతనం అందించిన సీఎం కేసీఆర్‌.. మరోసారి మా కలను నెరవేర్చారు. 65-75 ఏండ్ల మధ్య వయసున్న వీఆర్‌ఏల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎంకు ధన్యవాదాలు. గ్రామ రెవెన్యూ సహాయకులుగా ప్రకటించడం, గౌరవ వేతనాన్ని పెంచడంతో సమాజంలో మాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పేస్కేల్‌ ఇస్తామని, వయసు పైబడినవారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం సంతోషకరం. 

-ఎం రాజయ్య, వీఆర్‌ఏల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

రెవెన్యూశాఖ ప్రతిష్ఠను పెంచిన సీఎం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెవెన్యూ ఉద్యోగుల పనితీరును మెచ్చుకోవడం హర్షణీయం. రెవెన్యూశాఖ సేవలను కొనియాడటం ద్వారా సీఎం మా శాఖ ప్రతిష్ఠను పెంచారు. సీఎం మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం. ట్రెసా విజ్ఞప్తిమేరకు వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.

- తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌  అసోసియేషన్‌ (ట్రెసా)అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్‌

పాశ్చాత్య దేశాలకు దీటుగా చట్టం:టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన రెవెన్యూచట్టం, పాశ్చాత్య దేశాలకు దీటుగా ఉన్నదని టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో భూ వివాదాలు, హత్యలు, ఆత్మహత్యలు ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప చట్టాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక ఏ బాధా ఉండదు

సీఎం కేసీఆర్‌ తెచ్చిన రెవెన్యూ చట్టంతో రైతులకు ఇక ఏ బాధా ఉండదు. గతంలో భూమి కొన్నా.. అమ్మినా వీఆర్వోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనులు కాకపోయేవి. ఒకరి భూమి ఒకరికి చేసి రైతుల నుంచి పైసలు గుంజేది. ఇకముందు పనుల కోసం వీఆర్వోల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. అన్నదాతల బాధలు తీర్చేలా వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్‌ సీఎంగా ఉండడం మన అదృష్టం.   

-రామసహాయం జనార్దన్‌రెడ్డి, రైతు, బిక్కుమళ్ల, నూతనకల్‌, సూర్యాపేట జిల్లా 


logo