మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 13:33:01

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందజేద్దాం

భవిష్యత్  తరాలకు స్వచ్ఛమైన గాలిని అందజేద్దాం

ఖమ్మం : భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని  అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆరో విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్యక్రమం చేపట్టిందని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3, 11వ డివిజన్లలో మంత్రి  హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం చేప‌ట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేయడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటు అయిన తొలి నాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తెలంగాణకు హరితహారం పేరిట ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మానవ ప్రయత్నానికి ఐదేండ్ల కింద‌ట‌ సీఎం కేసీఆర్ బీజం వేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని అన్నారు. 


గ్రామ పంచాయ‌తీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ  ఆరో విడ‌త హరితహారం కార్యక్రమాన్ని  ప్రజలను భాగస్వామ్యం చేస్తూ  విజయవంతం చేయాలని, నాటిన మొక్కలను సంర‌క్షించేలా చూడాల‌ని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ,  జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, కార్పొరేటర్లు ప్రశాంతి లక్ష్మి, కొనకంచి సరళ , తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు ఉన్నారు.logo