బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 14:53:29

జీవవైవిధ్యాన్ని కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం

జీవవైవిధ్యాన్ని కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం

మంచిర్యాల : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా  జిల్లాలోని బెల్లంపల్లి ఆర్మ్ డ్  పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరీ, రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారయణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి 10,000 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాల్లో, అడవుల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నదని తెలిపారు.  అందుకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడమే తప్ప అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చెప్పకపోవడం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.


ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజవ్, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, ఏఆర్ ఏసీపీ నాగయ్య,  బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఏఆర్ ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


logo