గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 08:02:40

వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుతపులి

వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుతపులి

హైదరాబాద్‌: నగర శివార్లలోని కాటేదాన్‌లో నెల రోజుల క్రితం కలకలం రేపిన చిరుతపులి ఆచూకీ లభించింది. నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి.. మరోమారు రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో సంచరించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంట్లోకి వచ్చిన చిరుత.. కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్నట్లు కెమెరాల్లో నమోదయ్యింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు. చిరుతను వెంటనే బంధించాలని కోరుతున్నారు. 

గత నెల 14న రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద ఉదయం 6 గంటల సమయంలో రోడ్డుపై కనిపింది. అటునుంచి పక్కనే ఉన్న ఓ తోటలోకి పారిపోయిన చిరుత పులి వ్యవసాయ యూనివర్సిటీ, పోలీస్‌ అకాడమీ పరిసరాల్లో తిరుగుతున్నది. మే 16న హిమాయత్‌ సాగర్‌ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానిక మత్సకారులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. జూన్‌ 3న వ్యవసాయ వర్సిటీ ఆరణలో తిరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.


logo