ఆదివారం 31 మే 2020
Telangana - May 03, 2020 , 21:59:15

ప్రాణభయంతో చెట్టెక్కిన చిరుత

ప్రాణభయంతో చెట్టెక్కిన చిరుత

లింగంపేట: మామూలుగా చిరుతను చూస్తేనే ఇతర జంతువులు పారిపోతుంటాయి. కానీ, అడవి కుక్కలు(రేసు కుక్కలు) వెంబడించడంతో ప్రాణరక్షణ కోసం ఓ చిరుత చెట్టెక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోతాయిపల్లి గ్రామానికి చెందిన  మేకలు, పశువుల కాపరులు   పోతాయిపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. పశువుల కాపర్లకు కొద్దిదూరంలో రేసుకుక్కలు అరుస్తుండడంతో పరిసరాలు పరిశీలించగా.. చెట్టుపై చిరుత ఉన్నట్లు గుర్తించారు. వారు ఆ కుక్కలను తరిమివేయగా.. చిరుత చెట్టుపై నుంచి దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆదివారం గ్రామాన్ని సందర్శించి చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పశువులు, మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోతాయిపల్లి, నందివాడ గ్రామాల రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు ఎల్లారెడ్డి రేంజ్‌ అధికారి చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు తునికాకు, వంట చెరుకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ఆయన సూంచిచారు.


logo