శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 14, 2020 , 09:50:39

కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై చిరుత

కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై చిరుత

రంగారెడ్డి : లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి రహదారులపై జనసంచారం లేదు. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు.. రోడ్లపైకి యథేచ్చగా వస్తున్నాయి. జంతువులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో రోడ్లపైకి అడవి జంతువులు వచ్చిన సంఘటనలు చూశాం. 

తాజాగా హైదరాబాద్ కు సమీపంలోని కాటేదాన్ వద్ద ఓ చిరుతపులి రోడ్డుపైకి వచ్చి అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద(ఎన్‌హెచ్‌-44కు సమీపంలో) గురువారం తెల్లవారుజామున స్థానికులు చిరుతను గుర్తించారు. ఆ చిరుత కాలికి గాయం కావడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయింది. రోడ్డుపై చిరుత ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ఇక చిరుత పులికి అతి సమీపంలో ఉండి స్థానికులు వీడియోలు చిత్రీకరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా.. తప్పించుకుని సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లోకి వెళ్లింది. ఆ ఫంక్షన్ హాల్ నుంచి అక్కడే ఉన్న బొప్పాయి తోటలోకి చిరుత పులి దూకినట్లు అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ కెమెరా సాయంతో చిరుత ఉన్న ప్రదేశాన్ని అధికారులు గుర్తించారు. ఫంక్షన్ హాల్ లోకి వెళ్లే క్రమంలో అక్కడున్న ఓ లారీ డ్రైవర్ ను చిరుత గాయపరిచింది. అతన్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 


logo