మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:06:59

నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
  • ఎస్జీఎస్టీ సవరణ బిల్లుతో చిరువ్యాపారులకు మోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః బడ్జెట్‌ సమావేశాల్లో ఆదివారం నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున వివిధ శాఖల మంత్రులు సంబంధిత బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అన్ని బిల్లులను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హుల తొలగింపు సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓటింగ్‌ నిర్వహించి ఈ బిల్లును ఆమోదించారు. తెలంగాణ లోకాయుక్త సవరణ బిల్లును కూడా మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పడినందున గతంలో ఉన్న చట్టంలో ఏపీ ఉన్నచోట తెలంగాణను చేర్చుతూ తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రవేశపెట్టారు. సకాలంలో పన్నులు చెల్లించినవారికి వడ్డీరాయితీ ఇవ్వడం, రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సహా పలు సవరణలు ప్రతిపాదించారు. దీనికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ్యుల మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. 


తెలంగాణ మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సహవాటా పింఛన్‌ (రద్దు) బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. దీన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను మరో పదేండ్ల వరకు వర్తింపజేస్తూ పార్లమెంట్‌ తీసుకొచ్చిన చట్టానికి ఆమోదం తెలుపాలని సీఎం కేసీఆర్‌ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా సభ ఆమోదించింది. అలాగే 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖల మంత్రి కేటీఆర్‌ చేసిన అభ్యర్థనలను కూడా సభ ఆమోదించింది.


ఎస్జీఎస్టీ సవరణ ఎందుకంటే..

తెలంగాణలోని చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్జీఎస్టీ సవరణ బిల్లు-2020లో పలు మార్పులను ప్రతిపాదించింది. ఎస్జీఎస్టీలో ప్రస్తుతమున్న కాంపోజిషన్‌ పథకం.. వస్తు, సేవలను సరఫరాచేస్తూ వార్షిక టర్నోవర్‌ రూ.1.50 కోట్లలోపు పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తున్నది. దీని ద్వారా వారు 1 శాతం పన్ను చెల్లించే వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ప్రకారం ఇకపై రూ.50 లక్షల్లోపు వార్షిక టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులకు కూడా కాంపోజిషన్‌ పథకాన్ని వర్తింపజేయనున్నారు. కాంపొజిషన్‌ చెల్లింపుదారులకు వార్షిక రిటర్న్‌లు, త్రైమాసిక చెల్లింపులు జరిపేలా ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు. దీంతో చిరు వ్యాపారులపై పన్ను భారం తగ్గుతుంది. మరోవైపు వస్తువులు సరఫరాచేసే వ్యాపారుల గరిష్ఠ రిజిస్ట్రేషన్‌ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు  పెంచారు. తద్వారా ప్రభుత్వ అవరాలకు అనుగుణంగా టర్నోవర్‌ను పెంచుకోవడానికి వీలవుతుంది. పన్ను ఆలస్యంగా చెల్లిస్తే స్థూల పన్ను విలువపై వడ్డీ చెల్లించే విధానం ప్రస్తుతం అమలులో ఉన్నది. ఇకపై పూర్తి స్థూల పన్ను విలువకు బదులుగా వ్యాపారులు నికర పన్నుపై వడ్డీ చెల్లించేలా చర్యలు చేపడుతారు. 


logo
>>>>>>