గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 11:05:54

కరోనాకు భ‌య‌ప‌డొద్దు.. మనోధైర్యమే మందు : మ‌ండ‌లి ఛైర్మ‌న్

కరోనాకు భ‌య‌ప‌డొద్దు.. మనోధైర్యమే మందు : మ‌ండ‌లి ఛైర్మ‌న్

నల్లగొండ : క‌రోనా మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డొద్దు.. మ‌నోధైర్య‌మే ఆ వైర‌స్‌కు స‌రైన మందు అని శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు. క‌రోనాను జ‌యించిన వారిలో అత్య‌ధికులు మ‌నోధైర్యం ఉన్న‌వారే అని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే కంగారు పడకుండా... తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే చాలా వరకు కోలుకుంటున్నారని చెప్పారు. అందుకు తమ కుటుంబమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. తమ ఇంట్లో కొడుకు, కోడలు, పని పనిమనుషులకు, వారి పిలల్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారంతా ఇంట్లోనే ఉంటూ కొద్ది పాటి మందులు, సరైన జాగ్రత్తలతో కోలుకున్నారని వివరించారు. 

నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి శ‌నివారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు. కరోనా రాగానే ఇళ్ళు ఖాళీ చేయించడం, కాలనీల్లోకి రాకుండా అడ్డుకోవడం లాంటి చ‌ర్య‌లు స‌రికాద‌న్నారు. మానవత దృక్పథంతో పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యం ఇవ్వాలని సూచించారు. కరోనా కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. 

అన్ని ఏరియా ఆసుపత్రిల్లోనూ రాపిడ్ కిట్ ల ద్వారా టెస్టులు చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. లక్షణాలు ఉన్నవారు మాత్రమే టెస్టులు చేయించుకుంటే చాలు అని చెప్పారు. కరోనాతో సహజీవనం తప్పదని ఇప్పటికే మోడీ, కేసీఆర్ లు స్పష్టం చేసారని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా విద్య, వైద్యంపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు ఖర్చు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు, బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు ఒకేసారి ఎవ్వరూ ఊహించలేదని అన్నారు. 

నూతన రాష్ట్రంలో కొత్త సచివాలయం  చాలా  అవసరమని, కోర్టులో కేస్ లు వేసిన వారు కూడా నూతన నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ప్రతి విషయంలో రాజకీయాలు అవసరం లేదని, ప్రతిపక్షాలు  రాద్ధాంతం మానుకుని రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 100 అంబులెన్స్ లు సమకూర్చడం అభినందనీయమని, అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తు యువతరానికి కేటీఆర్ ఓ ఆదర్శనేత అని, చక్కటి భాష, విజన్, విషయ పరిజ్ఞానం కేటీఆర్ సొంతమని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.


logo