బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 03:17:01

ప్రాణము నీవని..గానమె నీదని!

ప్రాణము నీవని..గానమె నీదని!

  • చెన్నైలో అనారోగ్యంతో  చికిత్స పొందుతూ కన్నుమూత 
  • శోకసంద్రంలో సినీ ప్రపంచం, అశేష అభిమానులు
  • గానచంద్రుడిని కోల్పోయామన్న  రాష్ట్రపతి కోవింద్‌
  • ప్రతి ఇంట్లో మార్మోగిన గళం:  ప్రధాని మోదీ
  • ఆయన లేనిలోటు  పూడ్చలేనిది: ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • నేడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నైలో అంత్యక్రియలు 

గానం.. గాయంచేసి వాయువులో లీనమైపోయింది.. రసరమ్యమైన అమృతధార అకస్మాత్తుగా ఆగిపోయింది..సరసస్వర సుర ఝరీగమనమైన సామవేదగానం.. అనంత లోకాలకు సాగిపోయింది.. సంగీత స్వరపేటిక       ఉన్నట్టుండి మూగబోయింది.. తమను పలికేవాడు లేడని సరిగమలు ఘోషిస్తున్నాయి.. దిక్కుతోచని పాట చౌరాస్తాలో నిలబడి దిక్కులు చూస్తున్నది.. ఎన్ని భాషలు.. ఎన్ని గీతాలు..? వీటికి ఇక స్వరాభిషేకం చేసేదెవ్వరు?..  గుండె గుండెనూ మీటిన స్వరం.. గుండెలవిసేలాచేసి వెళ్లిపోయింది.. ఆపాత మధురం.. ఆ పాట మధురం.. ఆ స్వరం అజరామరం.. ఆచంద్రతారార్కం

బాలూ! పాటిక్కడ పదమిక్కడ మేమిక్కడ నువ్వెక్కడ!

ప్రాణమె గానమని.. గానమె ప్రాణమని జీవిత పర్యంతం నాదోపాసన చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో తనువు చాలించారు. మహాగాయకుడి మరణాన్ని తట్టుకోలేక సంగీత,  సినీ ప్రపంచం తల్లడిల్లుతున్నది. రాష్ట్రపతి, ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆయనకు అక్షర నివాళులు అర్పించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై సమీపంలోని తమరాయిపక్కంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బాలు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. 

చెన్నై, సెప్టెంబర్‌ 25: గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ సినీ జగత్తులో నాలుగు దశాబ్దాలపాటు మధుర గాయకుడిగా పేరొందిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏండ్లు. కరోనా సోకటంతో ఆగస్టు 5న దవాఖానలో చేరిన బాలుకు గుండె, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రం కావటంతో.. ఆ లెజెండరీ గాయకుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఎంజీఎం దవాఖాన యాజమాన్యం ప్రకటించింది. బాలు మృతితో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్పీ భౌతికకాయాన్ని చెన్నైలోని కామదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. తమ అభిమాన, సుమధుర గాయకుడి చివరి చూపు కోసం వేలమంది అభిమానులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. కరోనాను జయించినా.. 

కరోనాతో బాలు ఆగస్టు 5న ఎంజీఎంలో చేరారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో అదే నెల 14న ఆయనకు కృత్రిమశ్వాస అందించటం మొదలుపెట్టారు. దాంతో క్రమంగా కోలుకున్న బాలు ఈ నెల 4న కరోనా నుంచి బయటపడ్డారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని దవాఖాన వర్గాలు 4వ తేదీన ప్రకటించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటినుంచి ఫిజియో థెరపీ తదితర చికిత్సలు అందించటంతో తనంతతానుగా ఆహారం తీసుకొనే స్థితికి చేరుకున్నారు. అంతలోనే అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో గురువారం నుంచి ఆయనకు అన్నిరకాల అత్యవసర చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకపోయింది. 

  • నింగికేగిన గాన గంధర్వుడు
  • రెండురోజుల్లో తిరిగొస్తా దవాఖాన నుంచి బాలు
  •  చివరి వీడియో సందేశం

చెన్నై: చెన్నైలోకి ఎంజీఎం దవాఖానలో చేరిన తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యం విడుదల చేసిన చివరి వీడియో సందేశం ఇప్పుడు వైరల్‌ అవుతున్నది. ‘ఎవ్వరూ ఆందోళన పడకండి. నేను ఆరోగ్యంగా ఉన్నారు. జలుబు, జ్వరం మాత్రమే ఉన్నాయి. జ్వరం కూడా దాదాపు తగ్గిపోయింది. మరో రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాను. కంగారు పడి అదేపనిగా నాకు ఫోన్లు చేయకండి. అందరికీ ఫోన్లో సమాధానం చెప్పటం ఇబ్బందికరంగా ఉన్నది. నేను బాగున్నాను.. బాగానే ఉంటాను’ అని ఆయన సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో తెలిపారు. కానీ, ఎక్కడిదీ కరోనా.. ఏమిటి ఈ కరోనా అంటూ గళం విప్పి నిలదీసిన గాన గంధర్వుడు చివరకు ఆ కరోనాబారినే పడ్డారు.
నేడు అంత్యక్రియలు 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి శనివారం ఉదయం 10.30కు చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమరాయిపక్కంలోని ఆయన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. భారీసంఖ్యలో అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో.. కరోనా జాగ్రత్తలలో భాగంగా పార్థివ దేహాన్ని శుక్రవారం రాత్రే ఫాంహౌస్‌కు తరలించారు. గాన గంధర్వుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

గాన చంద్రుడిని కోల్పోయాం  

‘భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన స్వరాన్ని కోల్పోయింది. యావత్‌దేశ సంగీత ప్రియులకు ఎస్పీ బాలు ఓ గాన చంద్రుడు. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ 

- రామ్‌నాథ్‌ కొవింద్‌, రాష్ట్రపతి 

ఎంతో బాధాకరం

‘ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన మా ఊరివాడైనందుకు చిన్నప్పటి నుంచి తనతో చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాను. ఇంతలో ఇలా జరుగడం ఎంతో బాధాకరం’

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి 

ప్రతి ఇంట్లో మార్మోగిన గళం 

‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణంతో మన కళా ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ప్రతి ఇంట్లో మార్మోగిన ఆయన గళం దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించింది. ఈ విచారకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’         

- మోదీ, ప్రధానమంత్రి 

ఆయన లేనిలోటు పూడ్చలేనిది

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు.. భారతీయులందరికీ అభిమాని అయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు చేసిన కృషి విఫలంకావడం దురదృష్టకరం. ఆయన లేనిలోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.           - సీఎం కే చంద్రశేఖర్‌రావు

గానం అజరామరం..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలు గానం, పాడిన పాటలు అజరామరంగా నిలుస్తాయి. బాలు మరణం దేశానికి, సంగీత ప్రపంచం, సినీ కళారంగానికి తీరనిలోటు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.

- గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ 

మనసుల్లో నిలిచిపోతారు

మహోన్నత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటు. వేల పాటల ద్వారా ఆయన ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలిచిపోతారు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. 

-పురపాలకశాఖ మంత్రి   కే తారకరామారావు

మన మదిలోనే ఉంటారు 

ఎస్పీ ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని, తను పాడిన పాటలతో మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని కేంద్రమంత్రి అమిత్‌ షా తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్ప, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ,  కేరళ సీఎం పినరాయి విజయన్‌ తదితరులు ఉన్నారు. 

బాలు మరణం దురదృష్టకరం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరం. సినీ లోకానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. 

 - ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు

చాలా బాధగా ఉన్నది

ఎస్పీ బాలు అకాల మరణం గురించి వినడానికే చాలా బాధగా ఉన్నది. సినీ సంగీత ప్రపంచంలో ఆయన గొప్ప కళాకారుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.

- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

బాలు పాటలు వింటూనే.. 

చిన్నప్పటి నుంచి బాలు పాటలు వింటూ పెరిగాను. ఆ స్వరాలు ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అన్ని వయసులవారు అభిమానించే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతిచెందారన్న వార్తను నమ్మడానికి కష్టంగా ఉన్నది. ఆయన మరణం దురదృష్టకరం.                         

- ఎంపీ సంతోష్‌కుమార్‌

బొగ్గుగనిలో మార్మోగుతున్న బాలు గాత్రం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘జై సింగరేణి.. జై సింగరేణి.. జై సిరులవేణి.. జై కల్పవల్లి.. జైజై కన్నతల్లి’ గీతం సింగరేణీయులకు స్ఫూర్తిదాయకం. నేపథ్య గాయకుడిగా బీజీగా ఉన్నసమయంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం ఈ గీతాన్ని పాడారు. 17 ఏండ్లుగా సింగరేణి గనుల్లో మార్మోగుతూ కార్మికులు, ఉద్యోగుల్లో స్ఫూర్తినింపుతున్న గీతాన్ని ఆలపించిన ఎస్పీబాలు ఇక లేరని తెలుసుకుని సింగరేణీయులు విషాదంలో మునిగిపోయారు. 


logo