శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 14:40:47

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చట్టపరంగా చర్యలు : సీపీ మహేశ్‌ భగవత్‌

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చట్టపరంగా చర్యలు : సీపీ మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ప్రసంగాల్లో రాజకీయ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న భద్రతా చర్యలపై సీపీ వివరాలను వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 30 డివిజన్లు ఉన్నాయన్నారు. ఎల్బీనగర్‌ జోన్‌లో 13, మల్కాజ్‌గిరి జోన్‌లో 17 వార్డులు ఉన్నాయి. 7 సర్కిళ్ల పరిధిలోని 30 డివిజన్లలో 1,640 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు జరిగిందన్నారు. వీటిలో 498 సమస్యాత్మక, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 

101 రూట్‌ మొబైల్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఏడు ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సర్కిల్‌కు ఒక్కో ఏసీపీకి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 8 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 6 డీఆర్సీ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న సీపీ రాజకీయ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించొద్దన్నారు. 


logo