బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 01:20:39

సారు సెప్తున్నడు గదా.. బుగులెందుకు?

సారు సెప్తున్నడు గదా.. బుగులెందుకు?

  •  పంటలగురించి పరేషాన్‌ బంద్‌
  • కేసీఆర్‌ సారు మాటే మా బాట
  •  గ్రామాల్లో రైతుల తీర్మానాలు
  • సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
  • నియంత్రిత సేద్యం వైపు మొగ్గు

ఆదిలాబాద్‌/భద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటి మార్కెట్‌ నైపుణ్యంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునకు అన్నదాతలు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు. తమ భూము ల్లో ప్రభుత్వం చెప్పిన పంటలను వేయడం ద్వారా ఆదాయం పెంచుకొంటామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాటలో నడుస్తామని ఏకగ్రీవంగా తీర్మానంచేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండ లం ముక్రా (కే) గ్రామంలో రైతులు నియంత్రిత సాగుచేస్తామని తీర్మానించి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంచేశారు. ఈ గ్రామంలో 160 కుటుంబాలు, 700 జనా భా ఉన్నది. వ్యవసాయ ప్రధానమైన ఈ గ్రామంలో పత్తి, సోయాబీన్‌, కంది, జొన్న, కూరగాయలను సాగుచేస్తుంటారు. పత్తి, సోయాబీన్‌ పంటలను పూర్తిగా అమ్ముతారు. ఆహార పంటలుగా కంది, జొన్న పంటలను సాగుచేస్తారు. గతేడాది వానకాలంలో 500 ఎకరాల్లో పత్తి, 300 ఎకరాల్లో సోయా, 80 ఎకరాల్లో కంది, 50 ఎకరాల్లో కూరగాయలు సాగుచేశారు. యాసంగిలో 50 ఎకరాల్లో జొన్న, 40 ఎకరాల్లో మక్కజొన్న వేశారు. ఈ ఏడాది 650 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో సోయా, 160 ఎకరాల్లో కంది, 40 ఎకరాల్లో కూరగాయల పంటలు వేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్‌ మీనాక్షీ గాడ్గే తెలిపారు. గతేడాదితో పోలిస్తే 150 ఎకరాల్లో పత్తి, 80 ఎకరాల్లో కంది పెరగనున్నది.

నెహ్రూనగర్‌ రైతుల ప్రతిజ్ఞ

ఇల్లెందు రూరల్‌: వ్యవసాయంలో నూతన ఒరవడికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు తమకు సమ్మతమేనంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌ రైతులు గురువారం ప్రతిజ్ఞచేశారు. ఈ వానకాలంలో మక్కజొన్న జోలికి వెళ్లబోమని, వరి, పత్తి, కంది, మినుము, పెసర పంటలను సాగుచేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఒడ్డుగూడెం సర్పంచ్‌ చాట్ల భాగ్యమ్మ, ఎంపీటీసీ పూనెం లింగమ్మ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ పెరుమాళ్ల కృష్ణయ్య పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు, ఖమ్మం రూరల్‌ మండలం చింతపల్లి గ్రామాల్లో సైతం రైతులు ప్రతిజ్ఞచేశారు.

రైతులు ముందుకొస్తున్నారు 

పత్తి, కంది ఎక్కువగా సాగుచేయడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ సారి 230 ఎకరాల్లో ఈ పంటలు పెరుగనున్నాయి. రైతులకు నాణ్యమైన, విత్తనాలు ఎరువులు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- మీనాక్షీ గాడ్గే, సర్పంచ్‌, ముక్రా(కే), ఆదిలాబాద్‌ 

సారు చెప్పింది చేస్తాడు..

సీఎం సారు ఏం చెప్తే అది పక్కాగ చేస్తాడు. ఆయనపై మాలాంటి పేద రైతులకు నమ్మకం ఉన్నది. సారు చెప్పిన మాటలు ఇని నేను పత్తి, కంది పంటలు రెండెకరాల్లో ఎక్కువగా వేస్తా. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. పోయినేడాది రెండెకరాల్లో పత్తి, కంది.. మూడెకరాల్లో సోయాబీన్‌ పోసిన. ఈసారి నాలుగెకరాల్లో పత్తి, కంది.. ఎకరంలో సోయాబీన్‌ ఏస్తా. ఎన్నో ఏండ్ల నుంచి ఈ రెండు పంటలు పండిస్తున్నా. ఎలాంటి పరేషాన్‌ లేకుండా దిగుబడి ఎక్కువ వస్తుంది.

- నామావాడే శంకర్‌, రైతు, ముక్రా (కే), ఆదిలాబాద్‌

చెప్పిన పంట వేస్తా

మేము ఏసిన కంది పంటను సీఎం కేసీఆర్‌ సారు కొంటమంటున్నడు. పత్తికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఇంకేమున్నది. వీటిని ఈ ఏడాది వానకాలం నుంచి ఎక్కువగా పండిస్తాం. తాతల కాలం నుంచి పత్తి, కంది పంటలు వేస్తున్నాం. నల్లరేగడి భూములు ఉండటంతో రెండు పంటలు బాగొస్తయి. నాకున్న పదెకరాల్లో పోయినేడాది ఐదెకరాల్లో పత్తి, కంది, నాలుగెకరాల్లో సోయా, ఎకరంలో కూరగాయలు పంటలు సాగుచేశాను. ఈ సారి 8 ఎకరాల్లో పత్తి, కంది, 2 ఎకరాల్లో సోయాబీన్‌ పోస్తా. సర్కారు వాళ్లకు అమ్మి లాభం పొందుతా. 

- జాదవ్‌ చంపత్‌, రైతు, ముక్రా (కే) ఆదిలాబాద్‌


logo