శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:21

తెలంగాణది విలక్షణ వీచిక

తెలంగాణది విలక్షణ వీచిక

  • రాష్ట్రం వచ్చాక సుసంపన్నసాహిత్యం వెలుగులోకి వచ్చింది
  • భాష లోతుపాతులు తెలిసిన పాలకుడుంటే ఇట్లా ఉంటుంది 
  • కాళోజీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి రామా చంద్రమౌళి 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘ఆదినుంచి తెలంగాణది ధిక్కార స్వభావం. ఆ ధిక్కా ర స్వభావమనేది విశ్వాసమనే ఉత్కృష్టమైన లక్షణంతో ఉద్భవించింది. విలక్షణమైన గొంతుతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది’ అని ప్రముఖ కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి అభిప్రాయపడ్డారు. మహాకవి కాళోజీ పురస్కారానికి ఈ ఏడాది రామచంద్రమౌళి ఎం పికయ్యారు. తెలంగాణ ఆవిర్భావం ముందు.. తరువాత నెలకొన్న భాషావికాసం, ధోరణుల్లో వచ్చిన, వస్తున్న మార్పులపై రామా చంద్రమౌళి నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.  

ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారం దక్కడాన్ని మీరెలా భావిస్తున్నారు?

వ్యక్తిగతంగా నాకు మార్గదర్శకులైనవారు ప్రజాకవి కాళోజీ. ఆ మహనీయుడి పేరిట ప్రభుత్వం అందిస్తున్న పురస్కారాన్ని నాకు ప్రకటించిన క్షణా న అమితానందం వేసింది. ఏకరీతి సాహిత్యాభిరుచు లు కలిగి ఉండటం వల్ల భాషకు అందిన మహదానంద గౌరవంగా భావిస్తున్నా.   ఈ అవార్డుకు ఎంపికచేసిన ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. 

మీ కుటుంబ నేపథ్యాన్ని, సాహితీ సృజనని వివరిస్తారా? 

మాది సాధారణమైన కుటుంబం. అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కనకయ్య. మేము ఆరుగురం అన్నదమ్ము లం. ముగ్గురు అక్కచెల్లెళ్లు. అందరిలో నేను పెద్దవాడ్ని. మా నాన్న ఆజంజాహి మిల్లులో కప్డాకాతాలో మొఖద్దం (సూపర్‌వైజర్‌). 1962లో అంటే నేను అప్పుడు 9వ తరగతి చదువుతున్నా.. అప్పుడు ‘చందమామ’లో నా మొట్టమొదటి కథ (సువర్ణ శతదళ పుష్ప రహస్యం) అచ్చైంది. తర్వాతి కాలంలో కథ, నవల, కవిత, విమర్శ వంటి ప్రక్రియల్లో నా ప్రయాణం సాగింది. 37 నవలలు, 356 కథలు, 12 కవిత్వ సంపుటాలు, 3 నాటకాలు, 4 విమర్శన గ్రంథాలు రచించాను. బాలమిత్ర నుంచి భారతి దాకా రాసే రచయితగా గుర్తింపు వచ్చింది. భారతిలో వెలువడిన  ‘విస్కీ తాగిన పక్షులు’ కవితను మహాకవి శ్రీశ్రీ ‘ద విస్కీ డ్రంకెన్‌' పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువదించడం నాకు గొప్ప అనుభూతి.  

కథ, నవల, నాటిక, కవిత.. వీటిలో  ఏదిష్టం?

ఒక సృజనకారుడిగా వివిధ సామాజిక, తాత్విక, ఆత్మానుగత, మార్మిక అంశాలతో కూడుకున్న జీవిత పార్వాలకు సంబంధించిన వస్తువులను తీసుకుని పాఠకులతో పంచుకోవాలనుకుంటా. ఆ వస్తువు తన రూపం, పరిధి, గాఢత, విస్తృతి, సంక్లిష్టతను బట్టి దానంతట అదే ఒక ప్రక్రియను రూపాంతరీకరించుకుంటుంది. విశాలమైన ఒక జీవన చిత్రాన్ని నవలలో తప్ప మరోరకంగా అభివ్యక్తీకరించలేం. ఇట్ల చూసుకుంటే నాకు అన్ని ప్రక్రియలు సమానమే. 

సమకాలీన తెలుగు సాహిత్య ధోరణి పట్ల మీ అభిప్రాయం?

తెలుగు సాహిత్యం ఒక పార్శ్వంలో అత్యుత్తమైనదిగా, మరో కోణంలో వేగవంతంగా పతనమవుతున్న స్థితిలో ఉన్నది. దీనికి కారణాలు అనేకం. సాహిత్య అధ్యయనం, సహజ అభిరుచులు కొనసాగిస్తున్న అతి తక్కువ మంది ఉత్తమ సాహిత్యాన్నే అందిస్తున్నారు. కానీ ఎవరికివారు గొప్ప సాహిత్యవేత్తలుగా ప్రకటించుకోవాలనే దుగ్ధతో అసాహిత్యాన్ని.. సాహిత్యం పేరుతో చెలామణిచేస్తూ భుజా లు ఎగురేస్తున్నారు. దీనివల్ల సాహిత్యాభిమానులకు ఆధునిక రచయితలపై గౌరవం తగ్గుతున్నది.

కాలనాళికను చరిత్ర కథాత్మక నవలగా మీరెలా వర్ణిస్తారు..?

1934 నుంచి వరంగల్‌లో నిజాం ప్రారంభించిన ఆజంజాహి మిల్లు నుంచి మొదలై 2014 దాకా తెలంగాణ ఏర్పడి బంగారు తెలంగాణవైపు అడుగులు వేస్తున్న కాలం దాకా 80 ఏండ్ల సుదీర్ఘ చరిత్రను, చరిత్రకథాత్మక  నవలగా కాలనాళికను వెలువరించాను. ఇందులో వివిధ దశల్లో ఉద్యమించి, జీవించి ఉన్న ఉద్యమకారుల వాస్తవజీవితాలు ఉన్నాయి. మన కండ్లముందే సజీవంగా ఉన్న మనుషులు కూడా పాత్రులుగా ఉన్న నవలను రాయడం ఒక సాహసోపేత క్రియ. దీన్ని కొంతమంది వర్తమాన ఇతిహాసంగా కూడా అభివర్ణించినవారు ఉన్నారు. 

మీ రచనల్లోని విలక్షణతను వివరించండి?

నాకు నేనుగా, నన్ను నేను నిర్వచించుకున్న ఐచ్ఛికత ఉన్నది. ప్రక్రియ ఏదైనా నా సృజన మిగతా సాహితీకారులకంటే విలక్షణంగా, భిన్నంగా, వినూత్నంగా ఉండాలని నా బలమైన ఆకాంక్ష. అందువల్ల కవిత్వం, కథ, నవల, శీర్షిక భిన్నమైన శైలిని గమనాన్ని కలిగి ఉంటాయి.  

నవలా ప్రక్రియలో మాండలికం వాడటంపై మీ అభిప్రాయం?

రచనల్లో సంచరించే ప్రతి పాత్రకు ఒక నేపథ్యం, ప్రాంతీయత, ఉనికి, అస్తిత్వానికి సం బంధించిన అంశాలు ఉంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి మాత్రమే స్థానిక యాస, మాండలికం ఉండాలి కానీ, రచయితే ఒక ప్రాంత మాండలికాన్ని కావాలని మాట్లాడటం సరికాదు. 

వృత్తి ఇంజినీర్‌, ప్రవృత్తిసాహితీకారులు. ఇది ఎలా సాధ్యమైంది?

కళలు ఏవైనా దైవదత్తాలే. మనిషి వృత్తికి, ప్రవృత్తికి సంబంధమే లేదు. వృత్తిరీత్యా ఒక ఇంజినీర్‌ అయిన నాకు తెలుగు భాషతో సంపర్కమే లేదు. కానీ యాదృచ్ఛికంగా కాళోజీ గురువు.. గార్లపాటి రాఘవరెడ్డి నాకూ గురువే కావడం. వరంగల్‌లోని మహబూబియా హై స్కూల్‌లో చిన్నతనంలో తెలుగుభాష పట్ల, సాహిత్యం పట్ల సహజమైన మక్కువ ఏర్పడింది. అదే నా ప్రవృత్తికి వాహికైంది.


logo