గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 01:01:46

ల్యాట్రైట్‌ లడాయి

ల్యాట్రైట్‌ లడాయి

  • గిరిజనులు, భూయజమానుల మధ్య రగడ
  • దశాబ్దాలుగా సరిహద్దులు చూపని రెవెన్యూశాఖ
  • భద్రాద్రి జిల్లా మామిడిగుండాలలో తెగని పంచాయితీ
  • మామిడిగుండాల.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని

ఓ మారుమూల ప్రాంతం.. ఇక్కడి భూముల్లో ఉన్న ల్యాట్రైట్‌ ఖనిజం గిరిజనులకు, భూ యజమానులకు మధ్య చిచ్చుపెడుతున్నది. సమైక్యపాలనలో అప్పటి కలెక్టర్‌ గిరిజనులకు భూములు పంపిణీచేయగా వారు సాగు చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు గిరిజనులకు భూముల హద్దులు చూపలేదు. అయితే ఈ విషయంలో ఏండ్లుగా మిన్నకున్న భూయజమానులకు భూముల్లో ల్యాట్రైట్‌ గనులు ఉన్నట్టు తెలియడంతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. భూమి తమదంటూ గొడవకు దిగారు. అప్పట్లో ఎలాంటి అనుమతి లేకుండా భూయజమానులు కొంతమేర ల్యాట్రైట్‌ను తరలించారు. దీనిపై స్థానిక గిరిజనులు 

ఏటా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. 

ఇల్లెందు: స్వాతంత్య్రానికి పూర్వం రోంపేడు గ్రామ పంచాయతీ పరిధిలో రాఘవేంద్రరావు అనే భూస్వా మి ఉండేవారు. ఆయనకు మామిడిగుండాల గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 130లో 4,200 ఎకరాల భూమి ఉండేది. ఇదంతా ఎమర్జెన్సీ సమయంలో తనకున్న పలుకుబడితో పట్టాచేయించుకున్నదే. దీనిపై అప్పట్లో స్థానికులు, గిరిజనులు ఆందోళనచేసినా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత భూ సంస్కరణల చట్టం అమలులోకి వచ్చింది. 1993లో నాటి కలెక్టర్‌ మామిడిగుండాలలోని ఈ భూములను పరిశీలించి సీలింగ్‌ చట్టంపరిధిలోకి వస్తాయని తేల్చారు. భూయజమానికి సీలింగ్‌ చట్టం ప్రకారం తన కుటుంబసభ్యుల పేర్లతో 900 ఎకరాలు పట్టా పొందినట్టు రెవెన్యూ రికార్డుల ద్వారా తెలుస్తున్నది. 2,850 ఎకరాల సాగు భూమిని అప్పటి కలెక్టర్‌ గిరిజనులకు పంపిణీచేశారు. 38ఈ కౌలుదారు చట్టం ప్రకారం 350 ఎకరాలు తీశారు. దీనిని గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాచేసేందుకు అవకాశం కల్పించారు. భూదానం పేరుతో మరో 100 ఎకరాలను కేటాయించారు. గిరిజనులకు భూమి పంచారే తప్ప సరిహద్దులు చూపలేదు. గిరిజనులు దశాబ్దాలుగా ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు.    

అసలు సమస్య ల్యాట్రైట్‌

మార్కెట్‌లో ల్యాట్రైట్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉన్నది. ఐరన్‌, సిమెంట్లకు మార్కెట్లో ఎంత డిమాండ్‌ ఉన్నదో మనకు తెలిసిందే. ఈ రెండింటికీ ల్యాట్రైట్‌ ఖనిజం ఎంతగానో ఉపయోగపడుతుంది. సీమాంధ్ర సిమెంట్‌ ఫ్యాక్టరీలకు 2009లో కోట్ల విలువ చేసే సుమారు 50 వేల టన్నుల ముడి ఖనిజాన్ని ఇక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తున్నది. అప్పటి కలెక్టర్‌, ఆర్డీవో ప్రత్యేక దృష్టిపెట్టి ల్యాట్రైట్‌ తవ్వకాలకు అడ్డుకట్ట వేశారు.  త రువాత దానిని సొంతం చేసుకునేందుకు కొంద రు బడాబాబులు భూ యజమాని బంధువుల పేర్లతో పట్టాలు సంపాదించే పనిలో పడ్డారు.

సాగు భూమిలోనే ఖనిజం

గిరిజనులు సాగుచేస్తున్న భూమిలోనే ఖనిజ నిల్వలున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులకు ఉన్నది 900 ఎకరాలు మాత్రమే. అది కూడా గుట్టల ప్రాంతం. ఇందులో ఖనిజ నిల్వలు లేవు.. కేవలం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోనే ల్యాట్రైట్‌ ఉన్నది. ఆ భూములు తమవేనని రాఘవేంద్రరావు కుటుంబీకులు పట్టుబడుతున్నారు. సీలింగ్‌చట్టం ప్రకారం భూ యజమాని కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 53 ఎకరాల చొప్పున ఆరుగురికి 318 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా సమైక్య రాష్ట్రంలో భూ యజమాని కుటుంబీకులు ఇష్టానుసారంగా బినామీల పేర్లమీద వందల ఎకరాలకు పాస్‌పుస్తకాలు సంపాదించారు. ల్యాట్రైట్‌ బయ ట పడకముందు ఇటువైపు కన్నెత్తిచూడనివారు.. ఆ తర్వాత ఆ భూములు తమవేనని గిరిజనులతో గొడవకు దిగుతున్నారు. ఈ సర్వే నంబర్‌కు పక్కనే ఉన్న మరో వంద ఎకరాల్లోనూ ల్యాట్రైట్‌ విస్తరించి ఉండటం విశేషం. ధర్మారం, మిట్టపల్లి అటవీ ప్రాంతంలోనూ ల్యాట్రైట్‌ నిల్వలున్నాయి.   

అడ్డొస్తున్న గిరిజన చట్టాలు 

ల్యాట్రైట్‌పై కన్నేసిన కొందరు భూములను దక్కించుకొనేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేశారు. వారికి 1/70, పీసా చట్టాలు అడ్డుతగులుతున్నాయి. ఆ భూమిని గిరిజనేతరుల పేరిట మార్చితేనే మైనింగ్‌కు అవకాశం ఉంటుం ది. ఇటీవల రాఘవేంద్రావు కుటుంబసభ్యుల పేర్లమీద భూమిని బదలాయించాలని ప్రయత్నించి విఫలమయ్యారు.  

అందరికీ పట్టాలు లేవు.. 

30 ఏండ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నాం. స్వయంగా కలెక్టరే భూములు గిరిజనులకు పంచారు. ఇక్కడ విస్తారంగా ఉన్న ల్యాట్రైట్‌ మీద కన్నేసిన భూస్వాములు ప్రతి సంవత్సరం సాగును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములని గిరిజనేతరులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ పట్టాలివ్వాలి.

- ముక్తి కృష్ణ, మామిడిగుండాల, ఇల్లెందు

పూర్తిస్థాయిలో సర్వే జరగాలి..

మామిడిగుండాల భూములపై పూర్తిస్థాయిలో సర్వే జరగాలి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరిహద్దులు చూపించలే దు. సరిహద్దులు చూపకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. సర్వేచేయాలని పలుమార్లు గిరిజనులు మా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. పూర్తి సర్వేచేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది.  

- మస్తాన్‌రావు, తాసిల్దార్‌, ఇల్లెందు మండలం


logo