మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:33

భారీగా టెస్టులు

భారీగా టెస్టులు

  • ప్రజల ప్రాణాల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం
  • తప్పుడు ప్రచారంతో వైద్యుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయొద్దు
  • దేశంలో మరణాల రేటు 3శాతం, రాష్ట్రంలో 1.7% మాత్రమే
  • గాంధీలో వెంటిలేటర్లపై పది మందే
  • పద్ధతి మార్చుకోకుంటే ల్యాబ్‌లపై వేటు
  • క్యాబినెట్‌ భేటీలో లాక్‌డౌన్‌పై స్పష్టత
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

‘వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ప్రభుత్వాధికారులు ఎందరికో కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ చికిత్స అనంతరం వారికి నయమైపోయింది. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు.. లేదా కొవిడ్‌ ముదిరిన వారు ఎక్కడైనా ఒక్కరు చనిపోతే.. వేలమంది ప్రాణాలను కాపాడిన విషయం పక్కకు పోతున్నది. చెస్ట్‌ దవాఖాన హెడ్‌నర్స్‌ కొవిడ్‌తో చనిపోయారు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి దవాఖానల్లో చికిత్స చేస్తున్నారు. కొందరు పనిగట్టుకొని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వైద్య సిబ్బంది ఆత్మ  ైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారు’

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంగళవారం నుంచి పెద్ద మొత్తంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, చాలా శాంపిళ్లు పెండింగ్‌లో ఉండటంవల్ల రెండు రోజులు నిలిపివేశామని తెలిపారు. ఇప్పుడు మరింత పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తామని వెల్లడించారు. పాజిటివ్‌ ఉన్నవారికి ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం.. హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి దవాఖానల్లో సేవలందుతాయన్నారు. వీరి ఆరోగ్య వివరాలను వైద్యసిబ్బంది ఎప్పటికప్పడు తెలుసుకుంటూ సూచనలు చేస్తుంటారని తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్న చోట కంటైన్మెంట్‌ జోన్లు పెడుతామని చెప్పారు. లాక్‌డౌన్‌ విధింపుపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదన్నారు. 

మంత్రి ఈటల సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ముఖ్యకార్యదర్శి శాంతకుమారితో కలిసి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ సోషల్‌ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేయడంపట్ల మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యుల ఆత్మైస్థెరాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తిచేశారు.  వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి దవాఖానల్లో చికిత్స అందిస్తుంటే..  కొం దరు పనిగట్టుకొని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తూ.. వైద్య సిబ్బంది ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని, పనిచేసే గుండెలను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఇక ఎలాంటి లక్షణాలు లేనివారు సైతం పరీక్షలు చేయాలంటూ రావటం సరికాదన్నారు.  ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం అనుమతితో ఇప్పటికే 4700 మంది వైద్య సిబ్బందిని నియమించామని, వీరంతా మంగళవారం విధుల్లో చేరుతారని చెప్పారు. కొత్తగా మరో 150 అంబులెన్స్‌లను సమకూర్చుకున్నట్లు తెలిపారు.  


గాంధీలో వెంటిలేటర్‌ మీద ఉన్నది 10 మందే

రాష్ట్రంలో కరోనా పేషెంట్ల కోసం మొత్తం 17,081 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ఇప్పటికే 3500 బెడ్‌లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉండగా, కొత్తగా 6500 బెడ్లకు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే 1000 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, కొవిడ్‌ చికిత్స అందించే గాంధీ దవాఖానలో వెంటిలేటర్‌ మీద ఉన్నది కేవలం 10 మంది మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. వెంటిలేటర్ల కంటే ఆక్సిజన్‌ సదుపాయం ఎక్కువమందికి అవసరం అవుతున్నదన్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను చేతుల్లోకి తీసుకున్నామని, అక్కడ కూడా చికిత్స అందుతుందని తెలిపారు. బెడ్ల సంఖ్యను పెంచుకునే స్తోమత ప్రైవేటు దవాఖానలకు ఉండదని, అదే ప్రభుత్వమైతే అవసరం ఉన్నన్ని బెడ్లు సమకూర్చుకోగలదని చెప్పారు. ఛాతి దవాఖానలో రవికుమార్‌ అనే వ్యక్తికి చనిపోయాక పాజిటివ్‌ అని తేలిందన్నారు. వెంటిలేటర్‌ ఉండాలా లేదా అనేది వైద్యులు నిర్ధారిస్తారని చెప్పారు.  

మరణాల సగటులో మనది సగం

దేశంలో ఐదు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే అందులో మరణాల రేటు మూడు శాతం మాత్రమేనని చెప్పారు. ఇక మన రాష్ర్టానికి వస్తే మరణాలు రేటు 1.7శాతం మాత్రమే ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో 247 మంది చనిపోయారన్నారు. ఢ్రిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో పెరిగినట్లుగా హైదరాబాద్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయని, దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని సీఎం చెప్పారని ఈటల గుర్తుచేశారు.

ప్రైవేటు ల్యాబ్‌లు పద్ధతి మార్చుకోవాలి

అమెరికాలో వైరస్‌ నిర్ధారణ శాతం 16, 17శాతంగా ఉంటే, మన రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్‌లు చేస్తున్న పరీక్షల ఫలితాలు 70, 80 శాతం పాజిటివ్‌ రావటం ఆశ్చర్యం కలిగిస్తుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. అందుకే తమ వైద్య నిపుణులు ల్యాబులను సందర్శించి ప్రమాణాలను పరిశీలించారన్నారు. ప్రస్తుతం వారికి కొంత సమయం ఇచ్చామని, అయినా విధానం మార్చు కోకుంటే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

ఇండ్లలో ఉండి రికవరీ అవుతున్నారు: సీఎస్‌

అవసరం ఉన్న చోట పరీక్షలు చేస్తున్నామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం రోజూ 4000 దాకా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఏదో అయిపోతుందనే భావన వద్దని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పాజిటివ్‌ అని తేలితే, లక్షణాలు పెద్దగా లేకుంటే ఇంట్లో ఉండి కూడా బాగవుతారన్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా 104ను సంప్రదించాలని చెప్పారు. ఫోన్‌చేస్తే దవాఖానకు తీసుకెళ్తామని తెలిపారు.

లక్షణాలు ఉంటే కింగ్‌ కోఠికి వెళ్లాలి: శాంతకుమారి

ఎవరికి లక్షణాలు ఉన్నా ముందుగా కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి చెప్పారు. అక్కడ పరీక్షలు చేసిన అనంతరం పాజిటివ్‌ అయితే గాంధీ దవాఖానకు పంపుతారని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఐదారు శాతం మందికి మాత్రమే దవాఖానలో చికిత్స అవసరమవుతున్నదని చెప్పారు.

కరోనా రోగుల కోసం కొత్తగా..

4700 
మంది విధుల్లోకి
150 
అంబులెన్స్‌లు 
6500
 బెడ్లకు ఆక్సిజన్‌ 
17,081
బెడ్లు 
1000  
వెంటిలేటర్లు


వైరస్‌ సోకిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 

శాఖ
కేసులు
ఆరోగ్యం
258
ఆరోగ్యం (ప్రైవేట్‌)37
పోలీస్‌
184
మీడియా
53
జీహెచ్‌ఎంసీ
2
మొత్తం
534


logo