శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 01:41:12

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు భూములు

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు భూములు

  • ప్రతిజిల్లాలో 600 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు
  • భూసేకరణపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం ప్రతిజిల్లాలో కనీసం 600 ఎకరాల్లో పారిశ్రామికపార్కులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ సేకరణ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో భూమిని గుర్తించే పనిలో నిమగ్నమైన కలెక్టర్లు రోడ్డు, రైలు మార్గాలకు సమీపంలో ఉన్న స్థలాలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తం భూమి ఒకేచోట కాకుండా జిల్లా కేంద్రంతోపాటు, చిన్నచిన్న పట్టణాలు, పారిశ్రామికంగా అభివృద్ధికి అనుకూలంగాఉన్న ప్రాంతాలను ఎంపికచేస్తున్నారు. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో భూసేకరణ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టుల జలాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. యాసంగిలో 1.25 కోట్ల ఎకరాల్లో పంట సాగైం ది. వానకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర పంటలకు మంచి మార్కెట్‌ను సృష్టించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ముడిసరుకును మార్కెట్‌ సరుకుగా మార్చి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉ న్నది. ఇప్పటికే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలపై అధ్యయనం చేసి.. వాటినే పండించాలని రైతులకు నిర్దేశం చేస్తున్నది.


logo