ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:40:16

స్టూడియోలకు భూములివ్వడం కొత్తకాదు

స్టూడియోలకు భూములివ్వడం కొత్తకాదు

  • అధునాతన టెక్నాలజీతో నిర్మాణం
  • రూ.50 కోట్ల పెట్టుబడులు, సినీ కార్మికులకు ఉపాధి 
  • అన్నీ పరిశీలించే డైరెక్టర్‌ శంకర్‌కు కేటాయించాం
  • హైకోర్టుకు మున్సిపల్‌శాఖ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  సినిమా స్టూడియోల కోసం భూకేటాయింపులు గతంలోనూ జరిగాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయని మున్సిపల్‌శాఖ హైకోర్టుకు వెల్లడించింది. నిర్మాత, దర్శకుడు ఎన్‌ శంకర్‌కు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలో భూకేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో మున్సిపల్‌శాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. బీసీ వర్గానికి చెందిన డైరెక్టర్‌ శంకర్‌కు సినీరంగంలో 36 ఏండ్ల అనుభవం ఉన్నదని తెలిపింది. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వసతులతో ఫిల్మ్‌ స్టూడియో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని 2018లో ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేశారని తెలిపింది. ప్రాథమికంగా రూ.50 కోట్ల పెట్టుబడులు పెడుతామని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,300 మందికి ఉపాధి కలుతుందని ప్రతిపాదించారని పేర్కొన్నది. ‘స్టార్ట్‌ టు ఫినిష్‌' సౌకర్యాలతోపాటు అత్యంత అధునాతన ‘అండర్‌ వాటర్‌ ఫిల్మింగ్‌', హాలీవుడ్‌ తరహా సౌకర్యాలతో హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని డైరెక్టర్‌ శంకర్‌ తెలిపినట్టు వివరించింది.

ఈ ప్రతిపాదనను ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) సైతం ధ్రువీకరించిందని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీవీ,ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ రంగంలో శాశ్వత వసతుల అవసరం పెరుగుతున్నందున కేటాయింపులు చేసినట్టు తెలిపింది. తెలంగాణ యువత ప్రతిభకు పోత్సాహం లభిస్తుందని ఎఫ్‌డీసీ సైతం వెల్లడించినట్టు తెలిపింది. నల్లగొండ జిల్లాకు చెందిన డైరెక్టర్‌ ఎన్‌ శంకర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో జ్యూరీ మెంబర్‌గా, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌, ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌లో పనిచేశారని, నంది అవార్డు, ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు సాధించారని వెల్లడించింది. 

గతంలో భూ కేటాయింపులు ఇలా..

  • 1975లో అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోకు జూబ్లీహిల్స్‌లో 22 ఎకరాలు  
  • 1983లో పద్మాలయా స్టూడియోకు బంజారాహిల్స్‌లో 9.5 ఎకరాలు 
  • 1984లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరాల భూమి 
  • 1984లో డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి, నిర్మాత కే కృష్ణమోహన్‌కు రికార్డింగ్‌, ఎడిటింగ్‌, అవుట్‌డోర్‌ యూనిట్స్‌ కోసం అర ఎకరం చొప్పున కేటాయింపు.
  • 2001లో ఆనంద్‌ సినీ సర్వీసెస్‌ స్టూడియో నిర్మాణానికి జూబ్లీహిల్స్‌ 5 ఎకరాల భూమి