మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:24:11

పార్ట్‌-బీలోని భూముల పరిష్కారం 60 రోజుల్లో

పార్ట్‌-బీలోని భూముల పరిష్కారం 60 రోజుల్లో

 • రెవెన్యూకోర్టుల్లోని కేసుల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు
 • ధరణి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి మరిన్ని ఆప్షన్లు
 • సాదాబైనామా దరఖాస్తులకు సత్వర పరిష్కారం
 • పాస్‌పోర్ట్‌ నంబర్‌తో ఎన్నారై భూముల రిజిస్ట్రేషన్‌
 • సేత్వార్‌ వ్యత్యాసాలపై కలెక్టర్ల విచారణ.. తుది నిర్ణయం
 • ధరణికి ముందు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల మ్యుటేషన్‌
 • ఆన్‌లైన్‌లో ఈసీ, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు
 • ఇనాం భూముల సాగుదారులకూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ 
 • కంపెనీల వ్యవసాయభూముల క్రయ, విక్రయాలకు చాన్స్‌
 • ధరణిపై సమీక్షలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్‌-బీలో చేర్చిన భూములకు 60 రోజుల్లో జిల్లా కలెక్టర్లు పరిష్కారం చూపుతారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా భూములకు యాజమాన్య హక్కులు అందజేస్తారని ప్రకటించారు. సేత్వార్‌ వ్యత్యాసాలపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటారని, ఒకే సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల హద్దులను నిర్ధారిస్తారని చెప్పారు. సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిశీలించి ఆయా భూములను క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. 

ధరణి పోర్టల్‌ రాకముందు రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్లకు మ్యుటేషన్‌ పూర్తిచేస్తారని పేర్కొన్నారు. పాస్‌పోర్టు నంబర్‌ ఆధారంగా ఎన్‌ఆర్‌ఐల భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనున్నామని.. ఈసీ,మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకొనే వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయభూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు ఇస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరివద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి రాకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. రెండునెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోగా.. 80 వేల మంది రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ, ఇంకా మెరుగుపర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కే తారకరామారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితాసబర్వాల్‌, మీసేవా సీఈవో వెంకటేశ్వర్‌రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు రామయ్య, సుందర్‌ అబ్నార్‌, రఫత్‌ అలీ, కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్‌ పాటిల్‌, నారాయణరెడ్డి, శశాంక్‌, ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని, పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ పలు అంశాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. అవి..

 • ధరణి పోర్టల్‌ రాకముందు రిజిస్ట్రేషన్‌ అయిన భూములను రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్‌ చేయాలి. దీనికోసం మీసేవ ద్వారా మ్యుటేషన్‌ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.
 • సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదుచేయాలి. పట్టాదారు పాస్‌బుక్కులు ఇవ్వాలి. 
 • 1/70 చట్టం అమలులోలేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 అమలులోఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడేవిధంగా చర్యలు తీసుకోవాలి.
 • సేత్వార్‌ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. వివరాలను ధరణిలో నమోదు చేసి, పాస్‌బుక్కులు ఇవ్వాలి. 
 • ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిసి ఉన్న సర్వే నంబర్లను కొన్నిచోట్ల నిషేధిత జాబితా (22/) లో పెట్టారు. వాటిపై కలెక్టర్లు విచారణ జరిపి.. ప్రభుత్వ, ప్రైవేటు భూములను నిర్ధారించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్‌బుక్కులు ఇవ్వాలి. 
 • రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.
 • సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి. 
 • కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. 
 • ధరణి ద్వారా లీజ్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌, అగ్రిమెంట్‌ ఆఫ్‌సేల్‌, జీపీఏ చేసుకోవడానికి అవకాశమివ్వాలి.
 • నాలా ద్వారా కన్వర్ట్‌ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలి.
 • కంపెనీలు, వివిధ సంస్థలు వ్యవసాయభూముల అమ్మకానికి, కొనుగోలుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి. 
 • పాస్‌పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్‌ఆర్‌ఐల భూములు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం. 
 • ఈసీ, మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకునే అవకాశం. 
 • బుక్‌ చేసుకున్న స్లాట్‌ రద్దుకు వీలు కల్పించాలి. డబ్బులు తిరిగి ఇవ్వాలి. స్లాట్‌లో వివరాలు సవరించుకొనేందుకు అవకాశమివ్వాలి.
 • చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్‌ పార్టీ) క్యాటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్‌. 
 • మైనర్ల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలి.
 • అసైన్‌ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు బదలాయించాలి.
 • పట్టాదార్‌ పాసుబుక్కులు పోతే వాటి స్థానంలో ట్రూ కాపీ తీసుకునే అవకాశం.
 • ఇనామ్‌ భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. 
 • ధరణిలో స్లాట్‌ బుక్‌ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం తెలిపే ఆప్షన్‌ ఉండాలి.
 • ప్రభుత్వ, ఎఫ్‌టీఎల్‌, దేవాదాయ, వక్ఫ్‌, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయవద్దు.


logo