శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:54

పెండింగ్‌ రహదారులపై నిలదీయండి

పెండింగ్‌ రహదారులపై నిలదీయండి

  • నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచండి 
  • ఎంపీ నామాతో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, నిధులు సమకూర్చేలా ఒత్తిడి పెం చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావుకు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని నామా నివాసంలో వినోద్‌కుమార్‌ ఆయనతో సమావేశమయ్యారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి, అధికారులతో జరిపి న సంప్రదింపుల కారణంగా జాతీయ రహదారుల కోసం సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని వినోద్‌కుమార్‌ గుర్తుచేశా రు. జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ మధ్య రోడ్డు జాతీయ రహదారి నంబర్‌ 563తోపాటు మరో నాలుగు తక్షణం మంజూరు కావాల్సి ఉన్నదన్నారు. 

కరీంనగర్‌-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం జాతీయ రహదారి, కోరుట్ల-వేములవాడ-సిరిసిల్ల- సిద్దిపేట-జనగామ-సూర్యాపేట, ల్కతుర్తి-హుస్నాబాద్‌-సిద్దిపేట-మెదక్‌-నాందేడ్‌ రహదారి, కరీంనగర్‌-వీణవంక-జమ్మికుంట-చిట్యాల-భూపాలపల్లి- మహాదేవపూర్‌ - సిరోంచ జాతీయ రహదారులు వెంటనే మంజూరు కావాల్సి ఉన్నదని చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని గుర్తుచేశారు.